వాట్సాప్ కొత్త ఫీచర్‌పై వివాదం
-మెటా సంస్థకు కేంద్రం నోటీసులు
-ఇంకా లాంచ్ చేయలేదని వివరణ ఇచ్చిన వాట్సాప్
వాట్సాప్(WhatsApp) కొత్తగా తీసుకువస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్ పై పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఈ ఫీచర్ భారత్‌లో ప్రారంభం కాకుండా కేంద్రం బ్రేకులు వేస్తోంది. ఇప్పటికే ఈ విషయమై కేంద్రం నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో వాట్సాప్ మాతృసంస్థ మెటా వివరణ సైతం ఇచ్చింది…
వాట్సాప్ ప్రవేశపెట్టలనుకున్న యూజర్ నేమ్ ఫీచర్ విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. యూజర్ల వ్యక్తిగత గోప్యత వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ఈ ఫీచర్ తెస్తున్నట్టు పేర్కొంది. ఇది అందుబాటులోకి వస్తే యూజర్లు కొత్త వారితో చాటింగ్ కోసం ఫోన్ నెంబర్లు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. తమ అకౌంట్ యూజర్ఐడీ ఇస్తే సరిపోతుంది. అయితే, భారత్ లాంటి దేశంలో ఈ ఫీచర్ కొత్త చిక్కులు తేవొచ్చన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది అనేక మోసాలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసాలు జరిగిన సందర్భాల్లో నిందితులు ఎవరో తెలుసుకోవడం ఈ ఫీచర్‌తో మరింత కష్టంగా మారుతుందని అనుమానిస్తున్నారు.
రంగంలోకి దిగిన కేంద్రం…
దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ కొత్త ఫీచర్ వల్ల తలెత్తే భద్రతా పరమైన సమస్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర సర్కార్ నోటీసులు జారీ చేసింది. ఈ ఫీచర్‌ను భారత్‌లో లాంచ్ చేయవద్దని వాట్సాప్ మాతృసంస్థ మెటాను కేంద్రం ఆదేశించింది. ఈ అంశంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపాకే తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఫీచర్‌పై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మెటాకు కేంద్రం మూడు రోజుల గడువు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది..? దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు..? అనే విషయాలు చెప్పాలని కేంద్రం కోరినట్టు సమాచారం.
వివరణ ఇచ్చిన మెటా…
ఈ ఫీచర్‌ను తాము ఇంకా అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేయలేదని వాట్సాప్ ప్రతినిధి స్పష్టం చేశారు. ప్రస్తుతం వినియోగదారులు తమకు నచ్చిన ఐడీలను ముందస్తుగా ఎంచుకునే ఆప్షన్ మాత్రమే కల్పించామని తెలిపింది. ప్రజాప్రతినిధులు,అధికారులు, సెలబ్రిటీల పేర్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు, వారి ఐడీలను రిజర్వ్ చేసి ఉంచామని వెల్లడించింది. యూజర్ నేమ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినా, వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేయడానికి.. వాడటానికి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా అవసరమని తేల్చి చెప్పింది. ఈ కొత్త మార్పు వల్ల వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లదని, యూజర్ల డేటా రక్షణకు తాము కట్టుబడి ఉన్నామని వాట్సాప్ యాజమాన్యం భరోసా ఇచ్చింది.