ఫిబ్రవరిలోనే మండుతున్న ఎండలు

Weather Update : నిన్న, మొన్నటి వరకు చలి తీవ్రతతో జనం నానా ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడం, పొగ మంచు కమ్మేయడంతో ప్రజలకు కష్టాలు తప్పలేదు. ఇక ఇప్పుడు తన వంతు అన్నట్టుగా సూరీడు తన ప్రతాపం చూపుతున్నాడు. కొంతకాలంగా వాతావరణ పరిస్థితుల్లో తీవ్రమార్పుల నేపథ్యంలో అప్పుడే భానుడు భగభగలాడుతున్నాడు. సాధారణ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..
వాస్తవానికి మార్చి నెల నుంచి వేసవి ప్రారంభం అవుతుంది. వాతావరణ మార్పులతో ఫిబ్రవరి నుంచే వేసవి మొదలైందన్నట్లుగా ఉంది పరిస్థితి. కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పలు ప్రాంతాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలే ఇందుకు కారణం. రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా ఉక్కపోత కూడా క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలోని తెలంగాణలోని ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. ఈ రెండు జిల్లాల్లోనూ 36.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలంలో 35.6 డిగ్రీలు, మెదక్‌లో 34.8 డిగ్రీలుగా నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో ఇప్పుడే పగటిపూట ఉష్ణోగ్రతలు 34 నుండి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాత్రి సమయంలో 13 నుండి 22 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇది సాధారణంగా ఎండాకాలంలో నమోదయ్యే ఉష్ణోగ్రతలని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి..
ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. గుంటూరు, తిరుపతి, కడప, నెల్లూరు, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యాయి. మచిలీపట్నం, నందిగామ, బాపట్ల, కావలి, తుని, నరసాపురం, కాకినాడ, కర్నూలు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండు రోజుల్లో రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు, కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు పెరగొచ్చని ఐఎండీ ప్రకటించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితేంటని హడలిపోతున్నారు.
గత ఏడాది రికార్డు బద్దలు కొడుతుందా..?
భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. అనుకున్నట్టుగానే పరిస్థితి భయాన్ని కలిగిస్తోంది. ఈ ఫిబ్రవరి నెలలో దేశంలో వర్షపాతం దీర్ఘకాలిక సగటు (1971 నుంచి 2020) 22.7 మి.మీ. ఉండగా.. ఏడాది 81 శాతం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గత నెలలో భారతదేశంలో సగటున 4.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 1901 తర్వాత జనవరి నెలలో నమోదైన 4వ అత్యల్ప వర్షపాతం. వర్షాలు తక్కువగా పడటం కూడా వేడికి కారణమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి శివరాత్రి తర్వాత మెల్లిగా ఎండలు ప్రారంభం అవుతాయి. కానీ, ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండలు దంచికొడుతుండటంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.
పెరిగిన కూలర్లు, ఫ్యాన్ల వినియోగం..
ఈ సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మూడు రోజులు చలి తీవ్రత అలాగే ఉంటుందని చెప్పింది. ఎండల తీవ్రత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరిగింది. పెరిగిన ఎండల తీవ్రతతో ప్రజలు బయట తిరిగేందుకు భయపడుతున్నారు. రాత్రి సమయంలో ఉక్కపోత పెరిగి.. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.