బాధిత మహిళలకు రక్షణ, భరోసా

భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని రామగుండం కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లిలో భరోసా కేంద్రం ప్రారంభించి సంవత్సర కాలం అవుతున్న సందర్బంగా వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలు, బాలికలకు వైద్యం, కౌన్సిలింగ్, అన్ని రకాల సేవలు అందుతాయన్నారు. అంతేకాకుండా బాధితులకు పోలీసులు అండగా ఉంటారనే మనోధైర్యం కల్పించడం కోసమే ఈ భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయని స్పష్టం చేశారు. భరోసా కేంద్రాలలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందని తెలిపారు. హింస, లైంగిక వేధింపులకు గురైన పిల్లలు, స్త్రీలు తిరిగి ఇలాంటి వాటి బారిన పడకుండా చూడడమే భరోసా సెంటర్ ముఖ్య లక్ష్యం అన్నారు.
లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళాల కు లేదా బాలికలకు సంబంధించిన కేసు పోలీస్ స్టేషన్ లో నమోదైన సమయం నుంచి బాధితులకు అండగా ఉంటూ.. వారికి భరోసా కల్పిస్తూ, అందరికీ అవగాహన కల్పిస్తున్న భరోసా సెంటర్ సిబ్బందిని సిపి అభినందించారు. కార్యక్రమం లో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఏసీపీ జి. కృష్ణ, పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, పెద్దపల్లి ఎస్ఐ లు లక్ష్మణ్ రావు, మల్లేష్ లు, భరోసా సెంటర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.