మహాకుంభమేళాలో పడవలు నడిపి.. రూ.30 కోట్ల సంపాదన..

Maha Kumbh 2025: భారతదేశాన్ని ఏకం చేసిన పండుగ మహాకుంభమేళా.. దాదాపు దేశంలోని సగం మంది ప్రజలు ఈ ఆధ్యాత్మిక సంరంభంలో పాలు పంచుకున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 66 కోట్ల మంది మహాకుంభమేళాకు హాజరయ్యారని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో జరిగిన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. ఏకంగా 66 కోట్ల మంది ఈ వేడుకలో పుణ్యస్నానాలు చేయడం విశేషం. ప్రపంచ నలు మూలల నుంచి వచ్చిన భక్తులతో త్రివేణి సంగమం పులకించిపోయింది. ఈ వేడుక వల్ల ఎన్నో కుటుంబాలకు భారీగా ఆదాయం లభించింది. దాదాపు మూడు లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా వేశారు. అయితే, ఈ వేడుక నిర్వహణపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. కుంభమేళా వల్ల ఎంతోమంది ఆర్థికంగా లబ్ది పొందారని, ఓ కుటుంబం 130 పడవలు నడుపుతూ ఏకంగా దాదాపు రూ.30 కోట్లు ఆర్జించిందని ఆయన తెలిపారు. యూపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో సీఎం యోగి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారని అసెంబ్లీలో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ చేసిన ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించారు.
‘‘పడవ నడిపే ఓ వ్యక్తి విజయగాథ నేను పంచుకోవాలని అనుకుంటున్నా.. అతడి కుటుంబానికి 130 పడవలు ఉన్నాయి.. కుంభమేళా సమయంలో ఒక్కో పడవ ద్వారా రోజుకు రూ.50 నుంచి రూ.52వేల వరకు సంపాదించారు.. అంటే 45 రోజులల్లో ఒక్కో పడవతో దాదాపు రూ.23 లక్షల చొప్పున ఆదాయం వచ్చింది.. అలా మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్లు ఆర్జించారు’’ అని యోగి వివరించారు. మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది యాత్రికులు ప్రయాగ్‌రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారని సీఎం తెలిపారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను దిగ్విజయంగా నిర్వహించామని పేర్కొన్నారు. పలు విభాగాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు, సిబ్బంది ఈ వేడుకలో తమ అమూల్య సేవలను అందించారని కొనియాడారు.