భారీ సైబ‌ర్ కుట్ర భ‌గ్నం

Cyber ​​conspiracy foiled : పాత సెల్‌ఫోన్ల‌ను సేక‌రించి దాని ద్వారా దేశ‌వ్యాప్తంగా సైబ‌ర్ నేరాల‌(Cyber Crime)కు పాల్ప‌డేందుకు ఓ ముఠా వేసిన కుట్ర‌ను పోలీసులు చేధించారు. 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు సీజ్ చేశారు. ఐదుగురు బీహారీ సభ్యుల ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ ముఠా క‌ర్ణాట‌క‌లో 10 వేల మొబైల్ ఫోన్లు సేకరించి సైబర్ నేరాలకు పాల్పడినట్లు వెల్ల‌డించారు. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ విలేరుల స‌మావేశంలో పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి ప‌థ‌కం వేసుకున్నారు. దీనిలో భాగంగా త‌బ‌రాక్ అనే వ్య‌క్తి గ్యాంగ్ లీడర్ గా ఉంటూ మిగిలిన ఐదుగురు వ్య‌క్తుల‌ను తెలంగాణ‌కు పంపించాడు. వారంతా ఊర్ల‌లో తిరుగుతూ పాత మొబైల్ Phones తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తామంటూ పాతమొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, బ్యాటరీలను సేకరిస్తున్నారు. ఈ సెల్ ఫోన్లు, సిమ్ కార్డుల ద్వారా త‌బ‌రాక్‌, అతని అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు బ్యాంకు అధికారులమని, ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూ వివిధ రకాలుగా నమ్మిస్తూ మోసం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఓటీపీ పంపించి వాటిని తెలుసుకుని అమాయక ప్రజల బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులను మళ్లించుకుంటున్నారు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్న ఫోన్ల ద్వారా ఎంతో మంది అమాయక ప్రజలను మోసగించాలని కుట్ర పన్నిన‌ట్లు ఎస్పీ తెలిపారు.

మొబైల్ ఫోన్‌, సిమ్ కార్డులు అమాయక ప్రజల పేరుపై ఉండడంతో తమపై అనుమానం రాదని, చ‌ట్టం నుంచి తప్పించుకోవ‌చ్చ‌ని ఇలాంటి నేరాలు చేస్తున్న‌ట్లు ఎస్పీ వివ‌రించారు. వీరి వద్ద నుండి దాదాపు 2,125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు ద్విచక్ర వాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, 600 మొబైల్ బ్యాటరీలను వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ టూటౌన్‌ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన‌ట్లు వివ‌రించారు. ఈ ముఠా కర్ణాటక రాష్ట్రంలో దాదాపు పది నుండి 12 వేల వరకు మొబైల్ ఫోన్లను సేకరించి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడిన‌ట్లు ఎస్పీ చెప్పారు. సైబర్ నేరస్తుల కుట్ర చాకచక్యంగా చేధించి, వారిని అరెస్ట్ చేసిన సైబ‌ర్ క్రైం డీఎస్పీ హ‌సీబుల్లా, ఆదిలాబాద్ ఎస్‌డీపీవో ఎల్‌.జీవ‌న్‌రెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్ట‌ర్ క‌రుణాక‌ర్ రావు, సీసీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్ చంద్ర‌శేఖ‌ర్ ను ఎస్పీ అఖిల్ మ‌హాజ‌న్ అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like