రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన

Balka Suman: తెలంగాణ(Telangana)లో ఎమర్జెన్సీ పాలన సాగుతోందని మంచిర్యాల జిల్లా(Manchryala District) బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ దుయ్యబట్టారు. సీనియర్ మహిళా జర్నలిస్టు రేవతి(Senior woman journalist Revathi) అరెస్టు దారుణమన్నారు. ఉదయం 5 గంటలకు ఇంటి మీద దాడి చేసి జర్నలిస్టు రేవతిని అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒక రైతు కాంగ్రెస్ సర్కారులో తను ఎదుర్కొంటున్న కష్టాలను చెబితే ఆ వీడియోను పోస్టు చేసిన జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో మీడియా స్వేచ్ఛ అనేదే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మీడియా, సోషల్ మీడియా గొంతుకలపై చేస్తున్న ఈ దాడులను, అక్రమ కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం 5 గంటల సమయంలో 12 మంది మఫ్టీ పోలీసులు రేవతి ఇంటికి వెళ్లి ఆమెను అరెస్టు చేశారు. జర్నలిస్ట్ రేవతి ఫోన్, ఆమె భర్త దర్శకుడు చైతన్య దంతులూరి ఫోన్, ల్యాప్‌టాప్ సైతం పోలీసులు తీసుకెళ్లారు. రేవతికి చెందిన పల్స్ యూట్యూబ్ ఆఫీసును సీజ్ చేశారు. రైతుబంధు రావట్లేదని ఒక రైతు మాట్లాడిన వీడియో ప్రసారం చేసినందుకు అక్రమ కేసులు బనాయించి రేవతిని అరెస్టు చేసినట్లు సమాచారం.