మేడం సేవలో… సారు కారు..

ప్రభుత్వ సేవలకు కేటాయించిన ప్రభుత్వ వాహనాలను కొంతమంది అధికారులు తమ కుటుంబ సేవలకు వినియోగిస్తున్నారా..? విధి నిర్వహణలో మాత్రమే వినియోగించాల్సిన వాహనాలను తమ సొంత అవసరాలకు వాడుతున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. అధికారిక కార్యక్రమాలు నిర్వహించడానికి.. తనిఖీలకు, పరిశీలనకు సమకూర్చిన ప్రభుత్వ వాహనాలు కుటుంబ సభ్యుల కోసం, సినిమాలు, షికార్లు, షాపింగ్‌లకు, కుటుంబ పర్యటనలకు, బంధువుల ఇంట కార్యాలకు, ఆఖరుకు కూరగాయలు తీసుకురావడం, ఇలా చిన్నా చితక పనులకు సైతం ఇవే వాహనాలను వినియోగిస్తున్నారు.
ఆయనో జిల్లా అధికారి.. తనకు సంబంధించిన శాఖకు ఆయన జవాబుదారీగా ఉండాలి. కానీ, ఆయన తనకు కేటాయించిన వాహనాన్ని విచ్చలవిడిగా కుటుంబ అవసరాలకు సైతం వాడుకుంటున్నాడు. ఒక రకంగా ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడు. జిల్లా సంక్షేమాధికారి రౌఫ్‌ఖాన్ తనకు కేటాయించిన వాహనాన్ని సొంత అవసరాల కోసం ఇష్టం వచ్చినట్లుగా వాడుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ఆ వాహనాన్ని ఎక్కడికిపడితే అక్కడికి తిప్పుకుంటున్నాడు. ఇంటి దగ్గర నుంచి తన కార్యాలయానికి సొంత వాహనంలో వస్తూ తనకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని మాత్రం వేరే చోటికి పంపిస్తున్నాడు. ఎన్నో రోజులుగా ఈ తంతగం జరుగుతోందని పలువురు చెబుతున్నారు.
మేడం సేవలో..
రౌఫ్‌ఖాన్ భార్య జన్నారంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తారు. ఆమె కోసం ఈ కారు(టీఎస్02 ఎఫ్ఎల్ 4985) వాడుతున్నాడు. వాస్తవానికి ఈ కారు జిల్లా సంక్షేమాధికారి కోసం ప్రభుత్వం కేటాయించిన వాహనం. ఆయన కేవలం తన శాఖకు సంబంధించిన పనుల కోసం మాత్రమే వాడుకోవాలి. కానీ, నిత్యం ఆ వాహనం మాత్రం జన్నారం ట్రిప్పులు కొడుతోంది. కొన్ని సందర్భాల్లో ఇతర ప్రాజెక్టుల నుంచి వాహనాలు వాడుతున్నారు. ఇలా తన వాహనాన్ని కార్యాలయానికి తీసుకువెళ్తూ, ప్రభుత్వ వాహనాన్ని భార్య సేవలో వాడటం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకుంటారా..? ఆ శాఖలో అవినీతి కామన్ అని సైలెంట్‌గా ఉంటారా..? చూడాలి మరి…