నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్
తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి

మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు నియంత్రించేందుకు, ప్రజలకు దగ్గర అయ్యేందుకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి తెలిపారు. మంగళవారం మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంవీకే 5 ఇంక్లైన్ లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని ద్విచక్ర వాహనాలను, ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా కొత్త వ్యక్తులు, నేరస్తులు వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా..? అనే విషయం కూడా తెలుసుకునేందుకు, చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారా వంటి విషయాలు తెలుసుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీసులకు, డయల్ 100 కు ఫోన్ చేసిన వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వల్ల నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. సైబర్ నేరాల పాట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వినియోగించాలన్నారు. గుడుంబా తయారీకి సంబంధించిన బెల్లం పానకంతో పాటు, తయారీ వస్తువులను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాదారం ఎస్సై సౌజన్య, పోలీస్ సిబ్బంది , ప్రజలు పాల్గొన్నారు.