సిబ్బంది సమస్యల పరిష్కారానికే “పోలీస్ దర్బార్”
-విధుల్లో నిర్లక్ష్యం వద్దు
-అందరం సమన్వయంతో పని చేద్దాం
-రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Ramagundam Police Commissionerate : అందరం ఒక కుటుంబం… సమన్వయంతో క్రమశిక్షణ, ప్రణాళిక బద్దంగా విధులు నిర్వర్తించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. రామగుండం కమిషనరేట్ కి తెలంగాణ పోలిస్ కి మంచిపేరు తీసుకురావాలన్నారు. రామగుండం కమిషనరేట్ ఏఆర్ సిబ్బంది, అధికారులకు “దర్బార్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రయానికి సీపీ హాజరై ఏఆర్ పోలీస్ అధికారులు, సిబ్బంది తో మాట్లాడి సమస్యలను, వినతులను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలను వెంటనె పరిష్కరించే విధంగా చూస్తామన్నారు. ఏవైనా సమస్యలు దర్బార్ లో చెప్పడం ఇబ్బందిగా ఉంటే ఆఫీస్ కి వచ్చి నేరుగా కలిసి చెప్పవచ్చన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, మంచిప్రవర్తన తో విధులు నిర్వర్తించినప్పుడు వెంట ఉంటామన్నారు. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు అలవాటు పడి, విధులలో నిర్లక్ష్యం వహించినా, పోలీస్ శాఖ ప్రతిష్ట కి భంగం కలిగించే విధంగా ప్రవర్తించినా శాఖ పరమైన చర్య తీసుకుంటామన్నారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలని, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. వీటి వల్ల మానసిక శారీరక ఒత్తిడి నుండి దూరం కావచ్చని సీపీ స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని కొన్ని సందర్బాల్లో ఈ ఒత్తిళ్ల కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనాల్సి వస్తుందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒత్తిళ్లు తట్టుకోలేక క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే ముందు మీ కుటుంబ గురించి ఆలోచించాలని సూచించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపు నిర్వహించి అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ చెకప్ చేయించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సీ. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ లు దామోదర్,వామన మూర్తి, సంపత్, ఆర్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గోన్నారు.