రావి శ్రీ‌నివాస్‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించండి

Congress: సిర్పూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీ‌నివాస్ ను పార్టీ నుంచి తొల‌గించాల‌ని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్య‌క్షుడు విశ్వ‌ప్ర‌సాద్ రావు పార్టీ క్రమ శిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు ఆయ‌న టీపీసీసీ క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం చైర్మ‌న్ పి. చిన్నారెడ్డికి లేఖ రాశారు. ఆయ‌న మ‌హిళా మంత్రి, ఎమ్మెల్సీ, పీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా ఆరోప‌ణ‌లు చేశార‌ని, పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం లేద‌ని ఆయ‌న లేఖ‌లో పేర్కొన్నారు.

లేఖ సారంశం.. రావి శ్రీనివాస్ 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చారు. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన రావి శ్రీనివాస్ కు కేవలం 8,427 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీచినా, ఏ నియోజకవర్గంలో కూడా ఇంత తక్కువ ఓట్లు రాలేదు. దానికి ఆయ‌న‌ గారి ఒంటెద్దు పోకడలే ముఖ్య కారణం. కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై అహంకారపూరితంగా వ్యవహరించడంతో పార్టీకి నష్టం జరిగింది. ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొవాల్సింది పోయి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బీసీ కులగణన సర్వే పై ఆసిఫాబాద్ రోజ్ గార్డెన్ లో జిల్లా సన్నాక సమావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కార్యక్రమాన్ని అస్థిరం చేయాల‌ని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దురుసుగా ప్రవర్తించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠ‌ల్ పై అనుచిత వాఖ్య‌లు చేసి పార్టీ పరువు పోయే విధంగా ప్రవర్తించారు.

ఇంతేకాకుండా పార్టీ పిలుపునిచ్చిన ప్రజాపాలన వార్షికోత్సవ విజయోత్సవాల కార్యక్రమాలు, అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్ర నాయకుల దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాక సమావేశంలో పాల్గొనక పోగా ప్రత్యర్థి పార్టీ బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతు చెప్పాడు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అయినా మీనాక్షి నటరాజ్ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీపై ప్రభుత్వంపై ఎవరూ బహిరంగంగా విమర్శలు చేయకూడదని ఆదేశించినా ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. 19/03/2025 రోజున కాగజ్ నగర్ లోని ఎమ్మెల్సీ దండే విఠల్ స్వగృహానికి తన అనుచరగ‌ణంతో హంగామా సృష్టించి ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని రాష్ట్రంలో ఎలాంటి పనులు కూడా కావడం లేదని ఆరోపిస్తూ వ్యతిరేకంగా మాట్లాడారు.

రాష్ట్రంలో మొదటి ఆదివాసి మహిళా మంత్రి సీతక్క పై, ఆమె కొడుకుపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశాడు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్, ఇసుక వ్యాపారం చేసుకుంటూ మమ్మల్ని పట్టించుకోవడం లేదని కరోనా సమయంలో ఫొటోల కోసం నాలుగు ప్యాకెట్లు పంచి పబ్లిసిటీ చేసుకున్నారని మంత్రిని మీడియా సమావేశం సాక్షిగా ఆరోపిస్తూ వ్యక్తిగత ప్రతిష్టాన్ని దిగజారే విధంగా మాట్లాడాడు. అదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, పీసీసీ జనరల్ సెక్రటరీ సత్తు మల్లేష్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతర కృషి చేసారు. అలాంటి వ్యక్తి పైన రావి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు బాధాక‌రం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రావి శ్రీనివాస్ పై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి తొల‌గించాల‌ని కోరుతున్నాన‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like