మారిన ప‌రీక్షా ప‌త్రం

Tenth exams: ప‌ద‌వ తర‌గ‌తి పరీక్షలు ప్రారంభమైన తొలి రోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక ప్రశ్నా పత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బందులు ప‌డ్డారు. దీంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది. మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న పూర్వాప‌రాలు ఈ విధంగా ఉన్నాయి..

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాల (ZPHS) పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. అందులో ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ కేంద్రానికి చేరుకుంది. ఈ విషయం గుర్తించి అప్రమత్తమైన సీఎస్ జిల్లా విద్యాశాఖాధికారికి తెలిపారు. అప్రమత్తమైన డీఈవో కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకొని సరిచేసిన పరీక్ష పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11:30 గంటలకు మొదలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయంపై కలెక్టర్ సీరియ‌స్ అయ్యారు. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like