పరీక్షా పత్రంలో గందరగోళం.. ఇద్దరు అధికారులపై వేటు..

పదవ తరగతి పరీక్ష మొదటిరోజే ప్రశ్నాపత్రం ఇవ్వడంలో నిర్లక్ష్యానికి పాల్పడటం, పరీక్ష ఆలస్యం కావడానికి కారణమైన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే మంచిర్యాల జిల్లాలో ఓ పరీక్ష కేంద్రంలో గందరగోళం నెలకొంది. జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో అధికారులు ఒక పరీక్ష పత్రానికి మరో పరీక్షా పత్రం తీసుకున్నారు. పరీక్షాపత్రం విద్యార్థులకు ఇచ్చేముందు తప్పు గుర్తించినట్లు కలెక్టర్ వెల్లడించారు. అయితే, అప్పటికే దాదాపు గంటన్నర సమయం వృథా అయ్యింది. చీఫ్ సూపరింటెండెంట్ (ఆయన కస్టోడియన్ అధికారి కూడా), డిపార్ట్‌మెంట్ అధికారి పూర్తి నిర్లక్ష్యంగా జరిగిందని అధికారులు వెల్లడించారు.
నిర్లక్ష్యానికి కారణమైన చీఫ్ సూపరింటెండెంట్ మీర్ సఫ్దర్ అలీ ఖాన్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్ ఎన్.ఆర్. పద్మజను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ కుమార్ దీపక్ వెల్లడించారు. అదే సమయంలో విద్యార్థులు కోల్పోయిన సమయాన్ని భర్తీ చేయడానికి ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు స్నాక్స్ సైతం అందిచామన్నారు. డే-2 ప్రశ్నపత్రం అంటే హిందీ పేపర్ సీల్ తీయలేదన్నారు. దానిని పోలీస్ స్టేషన్‌లోనే భద్రంగా ఉంచినట్లు చెప్పారు. అదే సమయంలో ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చారని, పేపర్ లీక్ అయ్యిందంటూ వచ్చిన వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.