రెండు జిల్లాల్లో వడగండ్ల వర్షం

మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల వడగండ్ల వాన పడింది. ఉరుములు మెరుపులు,ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. లక్షేట్టిపేట, దండేపల్లి, జన్నారం, తాండూరు మండలాల్లో వడగళ్ల వాన పడింది. అదేవిధంగా కొమురం భీం జిల్లాలో సైతం వర్షం పడింది. కాగజ్ నగర్ పట్టణంలో సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలివానతో పలు షాపుల పై కప్పులు, రేకులు ఎగిరిపోయాయి. కాగజ్‌నగర్ పట్టణంలోని పోచమ్మగుడి ముందు ఉన్న సుమారు 150 సంవత్సరాల భారీ వృక్షం ఈదురుగాలులతో నేల మట్టం అయ్యింది. పలు చోట్ల మామిడి తోటల్లో ఉన్న పూత, కాత రాలిపోయింది. దీంతో రైతులకు నష్టం సంభవించింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు తాజా వర్షాలతో ఉపశమనం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.