హుటాహుటిన ఢిల్లీకి కిష‌న్ రెడ్డి

ఏ క్షణమైనా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి(Kishan Reddy) హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయ‌న త‌న షెడ్యూల్ ప్రోగ్రాం రద్దు చేసుకొని హ‌స్తిన‌కు వెళ్ల‌డంతో ఆయ‌న ప‌ర్య‌ట‌న వెన‌క ఆంత‌ర్యం ఏమ‌టనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆయ‌న సికింద్రాబాద్లో బీహారీ దినోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఆ ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకుని మ‌రీ వెళ్లారు. కిష‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ప్రకటన ఏ క్షణమైనా ఉండే అవకాశం ఉంద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. దీంతోనే ఆయ‌న హ‌స్తిన వెళ్లార‌ని చెబుతున్నారు. తెలంగాణ బీజేపీ అధ్య‌క్ష ప‌ద‌వికి సంబంధించి అగ్రనేతలు ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. టీ బీజేపీ నేతలతో మోడీ, అమిత్ షా, నడ్డాలతో విడివిడిగా భేటీ అయ్యారు. అయితే, సోషల్ మీడియాలో వచ్చిన పేర్లు అధిష్ఠానం పరిశీలించడం లేదని బండి సంజయ్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్‌కి చేరుకుంది. వాస్త‌వానికి జ‌న‌వ‌రి నెలాఖరుకే రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అయితే, ఆ వ్య‌వ‌హారం కాస్తా ఆల‌స్యం అయ్యింది. టీబీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు అధిష్టానం షార్ట్‌లిస్ట్‌ సైతం సిద్ధం చేసింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. షార్ట్‌లిస్ట్‌లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు సమాచారం..

ఈసారి తనకు ఛాన్స్‌ ఇవ్వాలంటూ బీజేపీ పెద్దల్ని కలిశారు రామచంద్రరావు.. పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుతో.. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే, ఈ రేసులో ఈటల రాజేందర్‌ ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటల ఆప్షన్ అని.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటలకు ప్లస్‌ పాయింట్‌ అవుతుందని చెబతున్నారు. ఈటలతో పాటు ధర్మపురి అర్వింద్, రఘునందన్‌రావు పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రి బండి సంజయ్‌ కూడా ఉంటారనే ప్రచారం కూడా జరిగింది.

మ‌రి అధిష్టానం ఎవ‌రి పేరు ఖ‌రారు చేస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. నేడో, రేపో పార్టీ ప్ర‌క‌ట‌న వెలువ‌డే అ వ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like