ఎమ్మెల్యే బెదిరించ‌లేదు..

మంచిర్యాల గోదావరి రోడ్ లో నిర్మించిన మహాప్రస్థానం నిర్వహణ కోసం తాము స్వచ్ఛందంగా ఆర్ధిక సాయం చేయడానికి ముందుకు వచ్చామని కుల సంఘాల నేతలు స్పష్టం చేశారు. మంగళవారం మీడియా సమావేశంలో కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బెదిరించడంతో చందాలు ఇస్తున్నామని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేసిన ఆరోపణలను ఖండించారు. సకల సౌకర్యాలతో ఎమ్మెల్యే నాలుగు ఎకరాల్లో మహాప్రస్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తే అక్కసు ఎందుకని దివాకర్ రావును ప్ర‌శ్నించారు. మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ గ‌తంలో నువ్వు స్మశాన వాటిక నిర్మాణం కోసం చందాలు ఎందుకు వసూలు చేశావని..? నిలదీశారు. మహాప్రస్థానం నిర్వహణ కోసం ప్రజల భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో మంచిర్యాల సంక్షేమ సంఘం పేరిట కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఎమ్మెల్యే మంచి నిర్ణయాలను దురుద్దేశ పూర్వ‌కంగా తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమన్నారు. ఎమ్మెల్యే బెదిరించాడనే ఆరోపణలు సత్యదూరమని ఆర్య వైశ్య సంఘం నాయకుడు అప్పాల రాము అన్నారు. స్వచ్చందంగా ఆర్ధిక సహాయం చేయడానికి సంఘం సభ్యులు ముందుకు వచ్చారని మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. ప్రజా సేవ చేయడంలో మార్వాడీ సమాజం ఎప్పుడు ముందు వరుసలో నిలుస్తోందని అందులో భాగంగానే మహాప్రస్థానం నిర్వహణకు చందాలు ఇవ్వడానికి ముందుకు వచ్చామని మార్వాడీ సమాజ్ నాయకుడు పవన్ తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like