తుపాకీ సేద తీరేనా…?

కూంబింగ్‌లు.. ఎన్‌కౌంట‌ర్లు… వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు… లొంగుబాట్లు… ఇలా ఎన్న‌డూ లేని విధంగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంది. త‌మ‌కు పెట్ట‌నికోట అయిన దండ‌కార‌ణ్యంలోకి కూడా పోలీసులు చొచ్చుకువ‌చ్చి మ‌రీ క్యాడ‌ర్‌ను దెబ్బ‌తీస్తున్నారు. ఆప‌రేష‌న్ క‌గార్ ప్రారంభం అయిన‌ప్ప‌టి నుంచి 400 మంది మృత్యువాత ప‌డ్డ‌ట్లు మావోయిస్టు పార్టీనే ప్ర‌క‌టించింది… ఈ నేప‌థ్యంలోనే శాంతి చ‌ర్చ‌లంటూ కాల్పుల విర‌మ‌ణ కోసం ముందుకు వ‌చ్చింది… ఈ శాంతి చ‌ర్చ‌లు సాగుతాయా..?

మావోయిస్టు పార్టీ చ‌రిత్రలోనే క‌నీవినీ ఎరుగ‌ని ఆటుపోట్లు ఎదుర్కొంటోంది. క్రమంగా వారి సంఖ్య తగ్గిపోతోంది. వరుస ఎన్‌కౌంటర్లలో పదుల సంఖ్యలో వారు చనిపోతున్నారు. కొంతమంది పోలీసులకు లొంగిపోతున్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తిగా మావోయిస్టు వ్యవస్థను భారత్ నుంచి తొలగించేలా కేంద్రం ప్ర‌భుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఈ మేర‌కు ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత చేప‌ట్టింది. అందులో భాగంగానే.. కూంబింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. కొద్ది రోజులుగా చత్తీస్‌గడ్‌-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, తుపాకుల తూటాలతో అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. మావోయిస్టులను వేటాడమే టార్గెట్‌గా అడవిని జల్లెడ పట్టి.. తుపాకులతో విరుచుకుపడుతున్నాయి భద్రతా దళాలు. దీంతో వారి వ్యూహాలకు చిక్కిన నక్సల్స్‌ ఎందరో ఇటీవల కాలంలో మృత్యువాత పడ్డారు.

అయితే, ఇదంతా మావోయిస్టు పార్టీకి కంచుకోట‌లాంటి దండ‌కార‌ణ్యంలో చోటు చేసుకుంటోంది. దీంతో ఒక ర‌కంగా పార్టీ అగ్ర‌నేత‌ల‌కు ఏం చేయాలో దిక్కుతోచ‌ని స్థితి. కాల్పుల మోత‌లు నిత్య‌కృత్య‌మ‌య్యాయి. పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు చొచ్చుకువ‌స్తుండ‌టంతో మావోయిస్టు పార్టీ ఆలోచ‌న‌లో ప‌డింది. ఏపీ, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలిపే దండ కారణ్యంలో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దాదాపు నాలుగేండ్లుగా దండ‌కార‌ణ్యం సైతం వారికి సేఫ్ ప్లేస్ కాద‌ని తేలిపోయింది. వేరే ప్రాంతాల‌కు వెళ్లి అక్క‌డ నుంచి పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించాల‌ని భావించినా అది కూడా సాధ్యం కాద‌ని మావోయిస్టు అగ్ర‌నేత‌లు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. వరుస ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో మావోయిస్టు పార్టీ చర్చల ప్రస్తావనతో ముందుకొచ్చింది.

ఈ చ‌ర్చ‌లు, కాల్పుల విర‌మ‌ణ అనేది ఇప్పుడు కొత్త ప్ర‌తిపాద‌న ఏం కాదు… గ‌తంలో చాలాసార్లు మావోయిస్టులు, ప్ర‌భుత్వాల మ‌ధ్య శాంతి చ‌ర్చ‌ల ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్ర‌భుత్వం, నక్సలైట్లతో చర్చలు జరిపింది. అప్పుడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున చర్చలకు నక్సలైట్లను చర్చలకు ఆహ్వానించారు. అడవుల నుండి అన్నలు హైద్రాబాద్ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏఓబీ సెక్రటరీ సుధాకర్, రాష్ట్రకమిటీ సభ్యుడు గణేష్‌, జనశక్తి నేతలు అమర్‌, రియాజ్ చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. 2004 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో నక్సలైట్‌ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. మొదటి దఫా చర్చల అనంతరం మళ్లీ కథ మొదటికొచ్చింది. ఎన్‌కౌంటర్లు మళ్లీ మొదలయ్యాయి. ఏకంగా శాంతి చర్చల్లో పాల్గొన్న నక్సలైట్‌ నాయకుడు రియాజ్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. దీంతో శాంతి చర్చల ప్రక్రియ అర్థాంతరంగా ముగిసింది.

చర్చలకు అడవి నుండి వచ్చిన మావోల ఉనికి తెలుసుకొన్న పోలీసులు ఆ తర్వాత ఆ పార్టీ అగ్రనేతలను మట్టుబెట్టారు. ఈ చర్చల తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ తీవ్రంగా దెబ్బ తిన్న‌ది. ఇక‌, 2010లో హింసకు స్వస్తి పలికేందుకు ఆనాటి కేంద్రమంత్రి చిదంబరం మావోయిస్టులకు పిలుపునిచ్చారు. నక్సల్స్ తో చర్చలకు తేదీని ఖరారు చేస్తామని చెప్పారు. ఈ కాలంలో ప్రభుత్వం కూడా ఏ విధమైన ఆపరేషన్ చేపట్టదని హామీ ఇచ్చారు. ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన ప్రతిపాదనకు మావోయిస్టులు కూడా సానుకూలం గా స్పందించారు. కానీ చర్చల విధివిధానాలపై సంప్రదింపులు జరుపుతున్న మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అధికార ప్రతినిధి ఆజాద్‌ ఎన్‌కౌంటర్ జ‌రిగింది. ఈ ఎన్‌కౌంట‌ర్‌తో ఆ చ‌ర్చ‌ల క‌థ సైతం అక్కడే ముగిసింది.

మూడేండ్ల కింద‌ట ఛ‌త్తీస్‌ఘ‌డ్ ప్ర‌భుత్వం చ‌ర్చ‌ల‌కు రావాల‌ని మావోయిస్టుల‌ను కోరింది. ప్రభుత్వం పిలుపునిచ్చిన నెల రోజుల తర్వాత మావోయిస్టుల నుంచి స్పందన వచ్చింది. ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు ముందుకు వచ్చారు. అయితే, ఈ విషయమై మావోయిస్టులు కొన్ని షరతులు విధించారు. జైల్లో ఉన్న నేతలను విడిచిపెట్టాలని కోరారు. జైల్లోని నక్సల్స్ నేతలే ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు వస్తారని కూడా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. పార్టీతో పాటు పార్టీ అనుబంధ సంఘాలపై విధించిన నిషేధం ఎత్తివేయాల‌ని కోరింది. తమపై దాడులను నిలిపివేయడంతో పాటు భద్రతా దళాల కూంబింగ్ కూడా నిలిపివేయాలని కూడా కోరింది. మావోయిస్టుల డిమాండ్లపై ప్ర‌భుత్వం సైతం స్పందించి భేషరతుగా చర్చలకు రావాలని మావోయిస్టు పార్టీని కోరింది. అలా ముందుకు వస్తేనే మావోయిస్టులతో చర్చలకు సిద్దంగా ఉన్నామని స్ప‌ష్టం చేసింది.

తాజాగా కేంద్ర ప్ర‌భుత్వానికి మావోయిస్టులు శాంతి చ‌ర్చ‌ల పేరుతో లేఖ విడుద‌ల చేయ‌డంతో మ‌ళ్లీ చ‌ర్చ‌ల‌పై అంద‌రి దృష్టి మ‌ళ్లింది. ఇలా ప్ర‌తిసారి చ‌ర్చ‌ల పేరుతో మావోయిస్టులు, ప్ర‌భుత్వాలు ముందుకు రావ‌డం ఆ త‌ర్వాత అవి విఫ‌లం అవుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మ‌రి ఈసారైనా మావోయిస్టులు ఇచ్చిన పిలుపున‌కు కేంద్ర ప్ర‌భుత్వం ముందుకు వ‌స్తుందా..? చ‌ర్చ‌లు స‌ఫ‌లం అవుతాయా..? ఇరువైపులా తుపాకుల మోత‌లు ఆగిపోతాయా..? అని ఎదురుచూస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like