అయోధ్యలో అద్భుతం… బాల రాముడి నుదుటన సూర్య తిలకం

Sri Rama Navami: శ్రీరామ నవమిని పురస్కరించుకుని అయోధ్య(ayodya) రామ మందిరంలో వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్య రామ మందిరంలో అద్భుత దృశ్యం కనువిందు చేసింది. బాలరాముని నుదిట సూర్యతిలకం ఆవిషృతమైంది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో ఈ రోజు ఉదయం సూర్య తిలకం స్వామి వారి ముఖంపై అద్భుతంగా కనిపించింది. బాలరాముడి నుదుటిపై సూర్యతిలకం కనిపించగానే భక్తజనం పరవశించిపోయారు. రామనామ స్మరణతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నల్లని బాలరాముడి నుదుటిపైన తెల్లని సూర్యకిరణాలు ప్రసరించాయి. సుమారు 4 నిమిషాల పాటు సూర్య కిరణాలు ప్రసరించాయి. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత వచ్చిన రెండో శ్రీరామనవమి ఇది. స్వామి దర్శనం కోసం దేశ, విదేశీ భక్తులు అయోధ్యకు పోటెత్తారు. ఈ సందర్భంగానే రామ్‌లల్లా నుదుటిపై సూర్యుడు తన కిరణాలతో తిలకాన్ని దిద్దే అద్భుత ఘట్టం యావత్ భక్త జనులను పులకింపజేసింది.
సూర్యతిలకం కోసం ఏర్పాట్లు ఇలా
మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోని బాలరాముడి విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పరిమిత సంఖ్యలో పైపులు, కుంభాకార, పుటాకార కటకాలతో ఒక వ్యవస్థను రూపొందించారు శాస్త్రవేత్తలు. ఆలయ శిఖర భాగంలో సూర్యకాంతి గ్రహించేందుకు ఒక పరికరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపులోపలికి కాంతి ప్రసరించి తిలకంగా కన్పించింది. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్(ఐఐఏ) శాస్త్రవేత్తలు, పరిశోధకుల సాయంతో కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ(సీబీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఈ విధంగా ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు.