ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా… అభివృద్ధి ఆగ‌దు

ఎట్టి ప‌రిస్థితుల్లో అభివృద్ధి ఆగ‌ద‌ని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగ‌ర్ రావు(Mancherial MLA Kokkirala Premsagar Rao) స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం జిల్లాకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ మంచిర్యాల జిల్లాకు వ‌స్తున్న నేప‌థ్యంలో మీడియా స‌మావేశంలో మాట్లాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని చెప్పారు. రాళ్ళవాగు పక్కన కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. అంతేకాకుండా, పలు పథకాలకు శ్రీకారం చుడతారని తెలిపారు. మాతా శిశు ఆసుపత్రి నిర్మాణం పనులను పరిశీలిస్తారని వెల్ల‌డించారు.

అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీప్లో వాటర్ టాంక్‌, జగదాంబ సెంటర్, మెయిన్ రోడ్, అర్చన చౌరస్తా మీదుగా బహిరంగ సభ స్థలం వరకు ర్యాలీ కొనసాగుతుందన్నారు. మంత్రులు సభలో కొత్త పథకాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దాదాపు 40 వేల మంది అభిమానులు సభకు హాజరవుతారని తెలిపారు. క్రమ శిక్షణ కార్యకర్తలు పార్టీకి బలమని ప్రేంసాగ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. 85 శాతం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, సన్నబియ్యానికి బోనస్, ఉచిత బస్సుప్రయాణం, ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ , ఉచితంగా బియ్యం పంపిణీతో ప్రజలకు ఆర్ధిక ప్రయోజనం చేకూరుస్తున్నామన్నారు.

టీఆరెస్ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల ప్రస్తుత ప్రభుత్వం ఆర్ధికంగా సతమతమవుతోందన్నారు. అయినా ఎక్క‌డా అభివృద్ధి ప‌థ‌కాలు ఆగ‌వ‌న్నారు. మంచిర్యాల డంప్ యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తుందని భరోసా ఇచ్చారు. వేంపల్లి లో ఇండ‌స్ట్రీయ‌ల్‌ పార్కు కోసం బలవంతంగా భూములు లాక్కోవడం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మహాప్రస్థానం మంగళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని నిరుపేదలకు ఉచితంగా అంత్యక్రియలు జరిగేందుకు వెసులుబాటు క‌ల్పిస్తున్నామ‌ని తెలిపారు. అక్కడే డెత్ సర్టిఫికెట్ ఇస్తారన్నారు. తాను చేసే అభివృద్ధి పథకాలను వక్రీకరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నేతలు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like