తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు

బతికున్న మహిళను రికార్డుల్లో చంపేసి 2 ఎకరాల భూమిని వేరే వ్యక్తి పై పట్టా చేసిన విషయంలో తహసిల్దార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ నిర్ణయం తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో 2 ఎకరాల భూమిని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు చిర్రం రమేష్ అనే వ్యక్తికి రెవెన్యూ అధికారులు పట్టా చేశారు.
అక్రమంగా పట్టా మార్పిడిపై భూ యజమాని ఫిర్యాదుతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. పట్టాదారుకు తెలియ కుండా అక్రమ పట్టా ఎలా చేశారు? దీనిపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ బెల్లంపల్లి ఆర్డీవో హరిక్రిష్ణను ఆదేశించారు. దీంతో ఆయన నెన్నెల మండల ఇన్ చార్జి తహసీల్దార్ ప్రకాశ్ ను ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు ఇవ్వాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం నెన్నెల తహసీల్దార్ సెలవులో ఉండగా, డీటీ ప్రకాశ్ ఇన్చార్జి తహసీల్దార్ గా ఉన్నారు. విచారణ నేపధ్యంలో తహసిల్దార్ పై వేటు వేస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ చర్యలు చేపట్టారు.
ఇప్పటికే అక్రమంగా పట్టా చేయించుకున్న చిర్రం రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ధరణి ఆపరేటర్ ఉదయ్ ని విధుల నుంచి తొలగించారు.