విద్యార్థులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు జూన్ మొదటి వారంలోగా నాణ్యమైన ఏకరూప దుస్తులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, వంటశాల, భోజనశాల, ప్రహారీగోడ ఇతర మౌళిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియ వేగవంతం చేయాలని, మే నెల 20లోగా దుస్తులు సిద్ధం చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించి దుస్తుల తయారీ కోసం కొలతలు తీసుకున్నట్లు చెప్పారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీ కోసం మహిళా స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం మాదిరిగా వచ్చే విద్యా సంవత్సరంలో సైతం విద్యార్థులకు ఏకరూప దుస్తులను తయారు చేసేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాలలో కుట్టు మిషన్లు కూడా అందించామన్నారు. సంఘాల సభ్యులు దుస్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఒక జత దుస్తులకు 75 రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు.
జిల్లాలోని మందమర్రిలోని బస్టాండ్ సమీపంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం అవకాశం కల్పించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతం అయినందున ఆసక్తి గల షెడ్యూల్డ్ తెగలకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పనులు పూర్తి అయి ఎం.బి. రికార్డులు సమర్పించిన వాటికి బిల్లులు చెల్లించామన్నారు. మిగిలి ఉన్న ప్రాంతాలలో పనులను త్వరగా పూర్తి చేసి రికార్డులు సమర్పించాలని తెలిపారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు హైదరాబాద్‌లో అందించిన శిక్షణకు సంబంధించిన ధృవపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, విద్యాశాఖ సమన్వయకర్త చౌదరి, మండల విద్యాధికారులు, ఎ.పి.ఎం.లు, జిల్లా సమాఖ్య, మెప్మా సభ్యులతో ఏకరూప దుస్తుల తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.