మీ సొంత నిర్ణయాలతో చెడ్డపేరు
కందిపప్పు కొనుగోలుపై ప్రభుత్వ ఆదేశాలు ఎందుకు పాటించలేదు..?
ఈ-టెండర్ విధానంపై ఎందుకు నిర్లక్ష్యం వహించారు..?
చిన్నారులు లేరనే సాకు చెప్పడం సరికాదు
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఫైర్
Minister Seethakka : మీ సొంత నిర్ణయాలతో మేం ఇబ్బందులు పడాల్సి వస్తోంది… మీ తప్పిదాల వల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది… కంది పప్పు కోనుగోలు విషయంలో సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు..? కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చింది..? సంజాయిషీ ఇవ్వాల్సిందేనంటూ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కందిపప్పు సరఫరా విషయంలో కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకు నామినేషన్ పద్దతి నిలిపి వేసి ఈ-టెండర్ విధానాన్నీ అవలంబించాలని ఆదేశించారు. కలెక్టర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మెంట్ కమిటీ ద్వారా టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు.
పోషకాహర తెలంగాణే మన లక్ష్యంగా సిబ్బంది పని చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు పూర్తి స్ధాయిలో పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 313 సెంటర్లు ఇంకా తెరుచుకోలేదు చిన్నారులు లేరనే సాకు చెప్పడం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. చిన్నారులు లేని అంగన్వాడీ కేంద్రాలను డిమాండ్ ఉన్న ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరంలో అన్ని కేంద్రాలు చిన్నారులతో కల కల లాడాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు గ్రేడింగులు ఇస్తామని, మంచి గ్రేడింగ్‌లు వచ్చే కేంద్రాల సిబ్బందికి, జిల్లా అధికారులకు అవార్డులు ఇస్తామన్నారు. అంగన్వాడి కి అందే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రతి సెంటర్ లో కనీసం 20 మంది చిన్నారులు ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క వెల్లడించారు. బడి బాట తరహాలోనే మీరు గ్రామాల్లో చిన్నారులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. 30 అంగన్వాడీ కేంద్రాల్లో అసలు పిల్లలు లేరని, 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉందని, 586 కేంద్రాల్లో పదిలోపే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం చిన్నారుల సంక్షేమం పై వందల కోట్లు ఖర్చు చేస్తోందని, మీరు సీరియస్ గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయన్నారు. గన్వాడి సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత మీదేనని వెల్లడించారు.
సామ్, మామ్ చిన్నారులను గుర్తించి రిపోర్ట్ చేయాలని, మీకు చెడ్డ పేరు వస్తుందని పిల్లల పోషకాహర లోపాన్ని దాచి పెడితే సమాజానికి నష్టమని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. 50 శాతం మంది అసలు రిపోర్ట్ చేయడం లేదని,. అందుకే చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా.. బలహీనమైన పిల్లలను గుర్తించి మాకు నివేదించాలని ఏం చేయాలో మేము చెబుతామంటూ చెప్పారు. పిల్లల అమ్మకాలు, బాల్య వివాహాలు, నిభందనలకు విరుద్దంగా దత్తత లపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, వారిలో చైతన్యం తెచ్చే ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డి డబ్ల్యు ఓ లతో మే మొదటి వారంలో చింతన్ శిబిర్ నిర్వహిస్తామన్నారు.
అంగన్వాడి కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టులను బ్లాక్ లిస్టు లో పెడతామని మరోమారు హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లాలో కోడిగుడ్ల సరఫరా సరిగా చేయని ఓ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ చేశామని, తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామ చంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఇతర అదికారులు, జిల్లా సంక్షేమ అధికారులు హాజరయ్యారు.