పీవోకేను భారత్‌లో కలపండి
-యావత్ దేశం కేంద్రానికి అండగా నిలుస్తుంది
-ఇందిరా స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలి
-ప్రధానమంత్రికి మా పూర్తి మద్దతు ఉంటుంది
-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధానమంత్రి గారికి పూర్తి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
“ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భం. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. 1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్‌పై ఇందిరా నాయకత్వంలో మన దేశం చూపిన తెగువ గుర్తు చేస్తున్నాను. ఇందిరా గాంధీ స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే, ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు)లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తదితరులు పాల్గొన్నారు.