అందుకే సమ్మె జేస్తున్నం..
కవితక్కకు వివరించిన టీబీజీకేఎస్ నేతలు - ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు శుభాకంక్షలు
సింగరేణిలో పలు సమస్యలపై సమ్మెలోకి దిగుతున్నట్లు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు టీబీజీకేఎస్ నేతలు వివరించారు. ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా హైదరాబాద్లో ఆమె నివాసంలో టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కోశాధికారి వెంకట్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణిలో సమ్మె నోటీసుపై కవితతో చర్చించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణకు వేలం వేయడాన్ని నిరసిస్తూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సమ్మె నోటీస్ ఇచ్చిందని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాల కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికుల పిల్లల వయో పరిమితి వయసు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. అలియాస్తో ఉన్న మారు పేర్ల సమస్య పరిష్కారం, కరోనా కారణం గా మెడికల్ బోర్డ్ లు ఆలస్యంగా నిర్వహించారని, అందులో కార్మికుల వారసుల పిల్లలకు 35 సంవత్సరాలు దాటిన వారికి వెంటనే ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్మిక సంక్షేమ, అభివృద్ధి సమస్యలను దృష్టిలో ఉంచుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని సమ్మె నోటీస్ లో పొందుపరిచినట్లు స్పష్టం చేశారు. కవితను కలిసిన వారిలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యువ నాయకులు భువన చంద్ర, రాజేష్, శశి, మనోహర్, టీఆర్ ఎస్ నేతలు నాగరాజు, శివ పాల్గొన్నారు.