కేసీఆర్‌కు షాక్ ఇచ్చేందుకు…
అధికార పార్టీకి షాక్ ఇచ్చేందుకు వేచి చూస్తున్న ఈటెల రాజేందర్‌కు ఎమ్మెల్సీ ఎన్నికలు అందివచ్చాయి. అధికార టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చే విషయంలో ఈటల రాజేందర్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. కరీంనగర్ జిల్లాలోనే ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు ఆయన పావులు కదుపుతున్నారు.
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ భానుప్రసాద్ రావుకు ఛాన్స్ ఇచ్చింది. ఈ విషయంలో తనకు అన్యాయం జరిగిందని ఆరోపించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయన పోటీ నుంచి తప్పుకుంటారని చాలామంది భావించారు. కానీ, ఆయన మాత్రం తాను బరిలో ఉంటానని చెప్పడమే కాకుండా టీఆర్ ఎస్‌కు రాజీనామా సైతం చేశారు. ఈ వ్యూహం వెనక మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారనే విషయం అర్ధం అవుతోందని టీఆర్ ఎస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీఆర్ ఎస్ ఈ ఎన్నికను సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై ఈటల రాజేందర్‌కు కొంతమేర పట్టు ఉంది. ఈ కారణంగానే ఆయన రవీందర్ సింగ్‌ను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రవీందర్ సింగ్.. తరువాత అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇది టీఆర్ఎస్‌ను మరింత టెన్షన్ పెడుతోంది. ఈటల రాజేందర్ సూచన మేరకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి రవీందర్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లారని జిల్లా రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. రవీందర్ సింగ్ ద్వారా టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చే బాధ్యత ఈటల రాజేందర్ తీసుకున్నారని.. ఆయనకు మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రకంగా టీఆర్ఎస్‌కు మరోసారి షాక్ ఇచ్చేందుకు ఈటల వ్యూహం రచిస్తున్నారు.
మరోవైపు ఈటల రాజేందర్ గేమ్ ప్లాన్ గురించి తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకత్వం.. కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిపించే బాధ్యతను జిల్లా మంత్రులు కమలాకర్, ఈశ్వర్‌తో పాటు పలువురు నేతలకు అప్పగించారు. ఇప్పటికే ఆ నేతలు రంగంలోకి దిగి స్థానిక నాయకులు తమ చేజారిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. మొత్తానికి కరీంనగర్‌లో కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు ప్లాన్ చేస్తున్న ఈటల రాజేందర్.. ఆ దిశగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
సర్ధార్ రవీందర్ సింగ్ సైతం అసంతృప్తులను కలిసి వారిని ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. అందుకే ఆయన రాజీనామా కూడా సమర్పించారు. ఇందుకోసం రవీందర్ సింగ్ తో పాటు మరికొంత మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేతల సెల్‌ఫోన్లు సైతం స్విచ్‌ఆఫ్ చేసి రహస్యంగా సమావేశం నిర్వహించినట్టు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా మొత్తం 1324 ఓట్లు ఉన్నాయి. వీరిలో 750కి పైగా ఎంపీటీసీలే ఉన్నారు. మిగతా వారు మున్సిపల్ కార్పోరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఇతర సభ్యులు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రవీందర్ సింగ్‌ను గెలిపించుకునేందుకు ఈటల, మరోవైపు మంత్రులు మంత్రాంగం ఏం జరుగుతుందో వేచిచూడాల్సిందే.