నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి అన్నారు. శుక్రవారం నకిలీ పత్తి విత్తనాలపై పోలీసు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. నకిలీ విత్తనాలతో భూ సారం కోల్పోయి రానున్న రోజుల్లో పంట దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణంపై కూడా ప్రభావం కలుగుతుందన్నారు. నకిలీ విత్తనాలు వాడటం వల్ల రెండు, మూడు క్వింటాళ్లు అధిక లాభం వస్తుందని ఆశపడితే పంట నష్టపోతే ప్రభుత్వం నుండి ఎలాంటి నష్టపరిహారం రాదన్నారు. నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో విత్తవద్దని, దొంగ చాటున వీటిని పంట పొలాల్లో నాటుతున్నారని సమాచారం వస్తే అక్కడికి వచ్చి చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ గ్లైపోసిట్ నకిలీ విత్తనాలతో రైతులకు చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. ఇలాంటి నకిలీ విత్తనాలలు అమ్మడం, కొనడం కానీ చేయకూడదన్నారు. ఈ నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలన్నారు. రైతులు ఫెర్టిలైజర్ దుకాణాల్లో ఏ విత్తనాలు తీసుకున్నా తప్పని సరిగా రసీదు తీసుకోవాలన్నారు. అనంతరం తాండూర్ ఎంపీడీవో కార్యాలయం నుంచి ఐబీ కేంద్రం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐబీ కేంద్రంలో మానవహారం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. నకిలీ పత్తి విత్తనాలు వాడొద్దు అని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎంపీడీవో శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి సుష్మ, రైతులు పాల్గొన్నారు.