ఎవరీ సంపత్…?
అధికార పార్టీ నేత దగ్గరి అనుచరుడు - నాలుగు రోజులుగా ఇక్కడే మకాం - అభ్యర్థుల విత్‌డ్రాలో కీలక పాత్ర - కేసు పెట్టేందుకు వెనకాడుతున్న పోలీసులు
ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విత్ డ్రా చివరి రోజు హైడ్రామా నడిచింది. అధికార పార్టీ నేతలు వెనక ఉండి పెద్ద తతంగం నడిపించారు. ఆ విషయంలో వారు విజయం సాధించలేకపోయారు. కొందరు కొత్త వ్యక్తులను తీసుకువచ్చి అందరి నామినేషన్లు విత్‌డ్రా చేయించేలా ప్లాన్ చేసినా అది బెడిసికొట్టింది.
అధికార పార్టీ నేత దగ్గరి అనుచరుడే..
మూడు, నాలుగు రోజులుగా అధికారి పార్టీకి చెందిన నేతకు దగ్గరి అనుచరులు అభ్యర్థుల నామినేషన్లలో కీలక పాత్ర పోషించారు. అభ్యర్థులతో మాట్లాడటం, నామినేషన్ విత్‌డ్రా చేయించడం వారితో మాట్లాడింది వారికి ముట్టచెప్పడం ఇదీ వారి పని. దాదాపు అందరితో విత్‌డ్రా చేయించగలిగారు.. కానీ, పెందూరు పుష్పారాణి నామినేషన్ ఒక్కటే మిగిలింది. అయితే ఆమె తన నామినేషన్ ఉపసంహరించకునేందుకు ససేమిరా అనడంతో అధికార పార్టీకి మింగుడు పడలేదు. దీంతో చివరి నిమిషం వరకూ ప్రయత్నాలు చేసిన నేతలు తమ వ్యూహం మార్చేశారు.
కలెక్టరేట్‌లోని ఒక రూంలో ఆ వ్యక్తి …
నామినేషన్ల విత్‌డ్రా సమయంలో పోలీసులు నేతలు అందరినీ బయటకు పంపించారు. అయితే ఒక్క వ్యక్తి మాత్రం లోపల ఉండిపోయారు. ఆయన అభ్యర్థీ కాదు… ప్రజాప్రతినిధి కాదు… మరి ఎందుకు ఉన్నాడని అటు మీడియాకు, ఇటు బీజేపీ నేతలకు అనుమానం వచ్చింది. దీంతో అతన్ని బయటకు తీసుకువచ్చి ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో పాయల శరత్ (బన్నీ), లోక ప్రవీణ్‌రెడ్డి ఇద్దరూ అతన్ని పట్టుకుని నిలదీశారు. పోలీసులు అతన్ని లోపల ఎలా ఉంచారని ప్రశ్నించడంతో ఏం చేయాలో అధికార పార్టీ నేతలకు, పోలీసులకు ఏం చేయాలో అర్దం కాలేదు. గొడవ సద్దుమణిగించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు సైతం విఫలమయ్యాయి. దీంతో చాలా సేపు ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు కేసేందుకు పెట్టడం లేదు..
ఇంత జరుగుతున్నాపోలీసులు ఆ వ్యక్తిపై కేసెందుకు పెట్టడం లేదనే అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ నేతకు దగ్గరి బంధువు కావడంతోనే అతన్ని తప్పించే ప్రయత్నాలు చేశారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న తుడుం దెబ్బ నేతలతో పాటు, బీజేపీ నేతలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులు మరి దొంగ పేరుతో ఏకంగా ఒక అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి.