భ‌యం భ‌యంగా.. దూరం దూరంగా..

Kalvakuntla Kavitha: అక్క ప‌ర్య‌ట‌న‌లో ఆమె వెంట వెళితే ఏమ‌వుతుందో..? వెళ్ల‌కపోతే ఏమ‌వుతుందో..? అధినేత‌కు కోపం వ‌స్తుందా..? ఇక్క‌డ జిల్లా అధ్య‌క్షుడు బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తాడా…? వెళ్లాలా….? వ‌ద్దా..? ఇలా వంద ప్ర‌శ్న‌లు.. వేయి ఆలోచ‌న‌లు.. స‌గ‌టు బీఆర్ఎస్‌, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌ల ప‌రిస్థితి. దీంతో చాలా మంది నేత‌లు, కార్య‌కర్త‌లు క‌ల్వ‌కుంట్ల‌ క‌విత మంచిర్యాల ప‌ర్య‌ట‌న‌కు దూరంగా ఉండిపోయారు…

తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం గౌర‌వ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత క‌ల్వ‌కుంట్ల క‌విత‌. కేసీఆర్ ముద్దుల త‌న‌య‌గా ఆమె ఎక్క‌డ ఉంటే అక్క‌డ హ‌డావిడి. సింగ‌రేణివ్యాప్తంగా ఉన్న నేత‌లు, తెలంగాణ జాగృతి నాయ‌కులు, బీఆర్ఎస్ ప్ర‌తినిధుల‌తో క‌విత‌క్క ఉన్న చోట హంగామా ఉండేది. మ‌రీ ముఖ్యంగా సింగ‌రేణి ప్రాంతానికి ఆమె వ‌చ్చారంటే కేవ‌లం ఆ జిల్లాకే ప‌రిమితం కాకుండా చుట్టుప‌క్క‌ల జిల్లాల నుంచి సింగ‌రేణి మొత్తం క‌ల్వ‌కుంట్ల క‌విత చుట్టు ఉండేది. అయితే ఇప్పుడు ప‌రిస్థితి వేరు. ఆమె కేసీఆర్‌కు లేఖ రాయ‌డం, అది లీక్ కావ‌డం… ఒక‌ర‌కంగా పార్టీని ధిక్క‌రించిన‌ట్లుగా వ్య‌వ‌హారం సాగుతుండ‌టం, క‌విత కొత్త పార్టీ పెడుతున్నారంటూ ప్ర‌చారం నేప‌థ్యంలో బీఆర్ఎస్ లో హాట్‌హాట్ టాపిక్ న‌డుస్తోంది.

నేత‌లెవ్వ‌రూ క‌నిపించ‌లేదు..
ఈ నేప‌థ్యంలోనే క‌విత మంచిర్యాల జిల్లా ప‌ర్య‌ట‌న పెట్టుకున్నారు. ఆమె ప‌ర్య‌ట‌న‌కు సంబంధించిన వ్య‌వ‌హారంలో ఏ ఒక్క పెద్ద నేత కానీ, ద్వితీయ ్రశేణి నాయ‌కులు కానీ ఎవ‌రూ క‌నిపించ‌డక పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. చుట్టు ప‌క్క‌ల జిల్లాల విష‌యం ప‌క్క‌న పెడితే క‌నీసం మంచిర్యాల జిల్లా నుంచి పెద్ద‌గా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రాలేదు. మంచిర్యాల ప‌ట్ట‌ణం నుంచి మాజీ కౌన్సిల‌ర్లు సైతం రాలేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు. ఇక‌, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నుంచి సైతం పెద్ద‌గా ఎవ‌రూ హాజ‌రు కాలేదు. క‌విత‌తో టీబీజీకేఎస్ నేత కెంగ‌ర్ల మ‌ల్ల‌య్య , మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య మాత్ర‌మే అది కూడా అన్నం తినే స‌మ‌యంలో కనిపించారు.

అయోమ‌యం.. గంద‌ర‌గోళం..
కవిత తిరుగుబాటు నేపథ్యంలో బీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అయోమ‌యం, గంద‌ర‌గోళంలో ప‌డిపోయారు. కవితను పార్టీ దూరం పెట్టినట్లుగానే పార్టీ శ్రేణులు భావించ‌డంతో ఎందుకైనా మంచిద‌ని ముందు జాగ్ర‌త్త‌గా దూరంగా ఉండిపోయారు. ఎక్క‌డా కూడా ప‌ట్టుమ‌ని ప‌ది మంది నేత‌లు లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించింది. ఇదంతా ఒక్కెత్తు కాగా, గ‌తంలో క‌విత ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి కార్య‌క్ర‌మం వివ‌రాలు, అన్ని నాయ‌కులు ఎప్ప‌టిక‌ప్పుడు చెప్పేవారు. కానీ,శుక్ర‌వారం అస‌లు ఆమె ప‌ర్య‌ట‌న ఎక్క‌డ నుంచి ఎక్క‌డి వ‌ర‌కు…? ఎవ‌రెవ‌రిని క‌లుస్తారు..? ఇలా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసిన మీడియా వాళ్ల‌కు ఎవ‌రూ కూడా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌నీసం ఫోన్లు కూడా ఎత్త‌లేదంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

జాగృతి నేతలతో కవిత పర్యటన..
అటు బీఆర్ఎస్ నేత‌లు కానీ, తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం నేత‌లు కానీ ఆమె వెంట రాక‌పోవ‌డంతో క‌విత షాక్ అయ్యారు. కేవ‌లం జాగృతి నేత‌ల‌తోనే త‌న ప‌ర్య‌ట‌న కొన‌సాగించారు. గ‌తంలో ఆమె వెంట కాన్వాయ్ మందీ మార్బ‌లం ఇలా హ‌డావిడిగా సాగే ప‌ర్య‌ట‌న నేత‌లు, ద్వితీయ శ్రేణి శ్రేణులు లేకుండానే సాగింది. బీఆర్ఎస్ శ్రేణులు కవిత వ్యక్తిగత కార్యక్రమంగా భావించి.. ఎందుకు వ‌చ్చిన త‌ల‌నొప్పిలే అంటూ దూరంగా ఉండిపోయారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like