కొత్త గనులు రాకపోతే.. మనుగడ లేదు

Singareni: సింగరేణి సంస్థలోని 12 ఏరియాల ప్రస్తుత గనుల పరిస్థితి, భవిష్యత్ లో చేపట్టబోయే గనుల సాధన కు అవలంబించాల్సిన కార్యాచరణపై సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తూ అధికారులు, ఉద్యోగులకు కర్తవ్య బోధచేస్తున్నారు. ఇటీవల కంపెనీలోని మేనేజర్ స్థాయి అధికారులతో, ఎస్సీ, ఎస్టీ, బీసీ లైసన్ అధికారులతో, ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడిన సీఎండీ… మంగళవారం ఏరియా జీఎంలతో ఒక్కొక్కరితో ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించి భవిష్యత్ పై దిశా నిర్దేశం చేశారు. ఏరియా జీఎంలతో తొలిసారిగా సుదీర్ఘంగా 10 గంటల పాటు ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. కంపెనీ విస్తరణపై అలాగే కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారంలో ఏరియా జీఎంలు పోషించాల్సిన పాత్రను కూలంకశంగా వివరించారు. ఆయా ఏరియాల్లో ఉన్న సమస్యలు, వాటికి సంబంధించిన పరిష్కారాలను సూచిస్తూ సమీక్షను కొనసాగించారు.
ఈ సందర్భంగా ఉత్పత్తి సాధనలో కీలకమైన ఓవర్ బర్డెన్ తొలగింపులోనూ ఎదురయ్యే సమస్యలను తొలగించేందుకు సంబంధిత కాంట్రాక్టర్లతోనూ అప్పటికప్పుడే మాట్లాడి వారి ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తితో పాటు రవాణాపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, బొగ్గు నాణ్యత, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని స్పష్టం చేశారు. పనుల్లో సమర్థత ప్రదర్శించని వారి పట్ల కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే నూతన గనులు లేకపోతే ఇల్లందు, మణుగూరు, బెల్లంపల్లి తదితర ఏరియాల భవిష్యత్ ఉండదని, ఈ నేపథ్యంలో నూతన గనుల కోసం కూడా ప్రయత్నాలు సాగించాలన్నారు. ముఖ్యంగా అటవీ అనుమతుల సాధనలో ఎలాంటి జాప్యం జరగకూడదన్నారు.
భూగర్భ గనుల్లోనూ నష్టాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కంపెనీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శాంతిఖని, అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టులో నష్టాల నివారణకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగులు యంత్రాలతో షిఫ్ట్ లో పూర్తి పనిగంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిని అవసరమైతే తొలగించాలని కూడా ఆయన ఆదేశించారు. గైర్హాజరు శాతాన్ని గణనీయంగా తగ్గించాలని, ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని కూడా సూచించారు. నైనీ లో బొగ్గు ఉత్పత్తి పైనా ఈ సందర్భంగా సమీక్షించారు. బొగ్గు రవాణాను సాఫీగా చేయాలన్నారు. నాణ్యత పెంపుదల చర్యలో భాగంగా సత్తుపల్లి వద్ద ఒక కోల్ వాషరీ ఏర్పాటుకు గల అవకాశాలను కూడా పరిశీలించాలని కోరారు.
కొత్తగూడెంలో జరిగిన ఈ సమావేశంలో డైరెక్టర్ ఈ అండ్ ఎండి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ పర్సనల్ వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ సుభాని, జనరల్ మేనేజర్ మనోహర్, ఏరియాల జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.