డంప్‌యార్డుపై ప్రజల ఆగ్రహం.. మున్సిపల్ చెత్త వాహనాల అడ్డగింత
బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ ఆలయ చౌరస్తా వద్ద డంపింగ్ యార్డు సమస్యపై స్థానికులు తీవ్ర ఆందోళనకు దిగారు. చెత్త డంపింగ్ వల్ల తీవ్ర దుర్వాసన, కాలుష్యంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ మున్సిపాలిటీ చెత్త వాహనాలను అడ్డుకున్నారు. ఈ నిరసనలో స్థానిక ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా పాల్గొన్నారు.
స్థానికులు మాట్లాడుతూ, డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమీపంలోని విద్యాసంస్థలు, గోల్‌బంగ్లా బస్తీతో పాటు నాలుగు, ఐదు వార్డుల ప్రజలు దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పోచమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు కూడా ఈ సమస్య తీవ్ర అసౌకర్యంగా మారిందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు గోగర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, తొలుత తాత్కాలికంగా ఏర్పాటు చేస్తామని చెప్పిన చెత్త డంపింగ్ కేంద్రాన్ని ఇప్పుడు శాశ్వత డంప్‌యార్డుగా మార్చారని ఆరోపించారు. దీనివల్ల ఆస్తమా బాధితులు, చిన్నారులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సమస్యను ఎమ్మెల్యే వినోద్‌తో పాటు మున్సిపల్ కమిషనర్ దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
డంపింగ్ యార్డును వెంటనే ఇతర ప్రాంతానికి తరలించి, స్థానిక ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.