ముందొచ్చి.. మందగించి..

monsoon 2025: ఈసారి ముందుగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు.. మందగించడంతో భానుడు మళ్లీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.. సాధారణంగా జూన్ 1న రావలసిన నైరుతి రుతుపవనాలు మే 24నే వచ్చాయి. 2009 తర్వాత మొదటిసారిగా ఇంత ముందుగా రావడం. దేశమంతటా విస్తరించి వర్షాలు విస్తారంగా కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కానీ, అనుకున్నదానికి భిన్నంగా తిరిగి వేడితో జనం ఇబ్బందులు పడుతున్నారు.
నైరుతి ముందుగానే రావడంతో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిశారు. భారీ వర్షాలు కురవడంత ఇక ఎండాకాలం అయిపోయినట్టే అనుకున్నారు.. కానీ, నైరుతి రుతుపవనాల మందగమనంతో వర్షాలు కురియడం లేదు. పైగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజులుగా తెలంగాణ, కోస్తాంధ్రతీరంలో ఎండల తీవ్రవత పెరిగిపోయింది. ఉక్కపోత కూడా పెరగడంతో.. ప్రజలు అల్లాడుతున్నారు. నైరుతి మందగమనంతోనే ఉష్ణోగ్రతలు పెరిగినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో, పశ్చిమ దిశ నుంచి వేడి పొడిగాలులు మొదలవ్వడంతో పాటు ఎండల తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ వెల్లడించింది.
పొడిగాలుల ప్రభావంతోనే నైరుతి రుతుపవనాల్లో మందగమనం నెలకొందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు పొడిగాలులు ఉంటాయని అంచనా. రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిశల నుంచి కిందిస్థాయి గాలులు వీస్తుండటంతో రాబోయే ఐదురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని తెలిపింది. రుతుపవనాల కదలిక బలహీనంగా ఉండడంతో అనేక ప్రాంతాల్లో తిరిగి వేసవి పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో కొన్నిచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నట్టుగా చెప్పింది.