రైతుల ఖాతాల్లో రూ. 345 కోట్లు జమ

రైతుల ఖాతాల్లో రూ. 345 కోట్లు జమ చేసిన‌ట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్ప‌ష్టం చేశారు. వ‌రిధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు రైతుల ఖాతాల్లో జ‌మ చేస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామ‌న్నారు. 321 కేంద్రాల ద్వారా 29 వేల 645 మంది రైతుల వద్ద నుంచి 1 లక్ష 98 వేల 307 టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశామ‌న్నారు. సంబంధిత రైతుల ఖాతాల్లో రూ. 345.13 కోట్లు జమ చేశామ‌న్నారు. రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం వరిధాన్యం కొనుగోలు చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యమైన వరిధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి కనీస మద్దతు ధర పొందాలని తెలిపారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని కరీంనగర్ లోని 68 మిల్లులకు, పెద్దపల్లిలోని 110 మిల్లులకు, జిల్లాలోని 22 మిల్లులకు తరలిస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి వేగంగా జరుగుతోందన్నారు. ప్రతి రోజు రూ. 10 కోట్ల నుంచి రూ. 20 కోట్ల వ‌ర‌కు రైతుల ఖాతాలలో జమ చేస్తున్నామ‌ని చెప్పారు. రైతు పండించిన ధాన్యం నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత యాసంగి 2023-24 సీజన్లో 1 లక్షా 55 వేల 67 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, యాసంగి 2024-25 సీజన్లో లక్షా 98 వేల 307 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ‌న్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like