హక్కులను కాలరాస్తున్న సింగరేణి
మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేసిన టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి

Singareni:సింగరేణి విజిలెన్స్ అమాయక, నిజాయితీ గల ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతోందని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.
విజిలెన్స్ అధికారులు అసమంజసమైన ప్రశ్నలను వేస్తోందన్నారు. సింగరేణిలో విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ మొబైల్స్ బలవంతంగా లాక్కోవడం సర్వసాధారణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొబైల్ పూర్తిగా వ్యక్తిగతo,వ్యక్తిగత పరిచయాలు, వ్యక్తిగత కాల్ వివరాలు, WhatsApp ద్వారా వ్యక్తిగత చాట్ ఉంటుందని పిటీషన్లో పేర్కొన్నారు. ప్రతి పౌరుడు వ్యక్తిగత గౌరవంతో జీవించాలని భారత రాజ్యాంగం హామీ ఇచ్చిందని రాజిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19, 20 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించడానికి, స్వేచ్ఛకు ప్రాథమిక హక్కు ఉందనీ ఆయన తెలిపారు. కోర్టు ఉత్తర్వులు లేకుండా వ్యక్తిగత మొబైల్‌లను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదన్నారు .
సింగరేణి విజిలెన్స్ మాత్రం రాజ్యాంగానికి చట్టానికి అతీతం అన్నట్లుగా ప్రవర్తిస్తూ అరాచకంగా వ్యవహరిస్తోందనీ ఆవేదన వ్యక్తం చేశారు. విజిలెన్స్ విచారణ పేరుతో ఉద్యోగుల కుటుంబసభ్యుల వ్యక్తిగత మొబైల్‌లను కూడా విజిలెన్స్ విభాగం సీజ్ చేస్తోందన్నారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో వ్యక్తిగత చాట్‌లను విజిలెన్స్ యాక్సెస్ చేయడం చాట్ ఆధారంగా అసమంజసమైన ప్రశ్నలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ కింద పౌరులకు ప్రాథమికంగా హామీ ఇచ్చిన హక్కులకు ఇది తీవ్రమైన ఉల్లంఘనగా అయన అభివర్ణించారు.
అందువల్ల సింగరేణి విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రవర్తనపై విచారణ జరిపి,బిఉద్యోగుల మొబైల్‌లను స్వాధీనం చేసుకుని జీవించే, స్వేచ్ఛ హక్కులను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.