చెప్పేదొక‌టి… చేసేదొక‌టి..

Congress:”ఒక కుటుంబానికి ఒక్క‌టే టిక్కెట్టు.. ఒక వ్య‌క్తి.. ఒక ప‌ద‌వి అనే సూత్రాన్ని పాటించాలి.. కుటుంబంలోని మరొక సభ్యుడు రాజకీయంగా చురుకుగా ఉంటే, ఐదు సంవత్సరాల సంస్థాగత అనుభవం తర్వాత మాత్రమే వారిని టికెట్ కోసం పరిగణిస్తారు”

2022, మే 15 రోజున కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయ‌క‌త్వం రాజ‌స్థాన్‌ ఉద‌య్‌పూర్ నవ్ సంకల్ప్ నిర్ణ‌యాలు ఇవి… అయితే, ఈ నిర్ణ‌యాలు కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం అమ‌లు చేయ‌డం లేదు. దీంతో ప్ర‌జ‌ల నుంచి ముఖ్యంగా పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల నుంచే నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పార్టీకి నిబ‌ద్ధ‌త‌తో ప‌నిచేసే వారికి కాకుండా జంపింగ్ జ‌పాంగ్‌ల‌కు టిక్కెట్లు, మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డంపై సొంత పార్టీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి పార్టీని అంటిపెట్టుకుని ఉండి క‌ష్ట‌కాలంలో పార్టీని ఆదుకున్న వారి ప‌రిస్థితి ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు.

మంచిర్యాల జిల్లాలో మంత్రి ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే విష‌యంలో ఉత్కంఠ వీడింది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగ‌ర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే గ‌డ్డం వివేక్‌లో ఎవ‌రికి వ‌స్తుంద‌నే విష‌యంలో చివ‌రి వ‌ర‌కు స‌స్పెన్స్‌లో పెట్టిన అధిష్టానం చివ‌ర‌కు వివేక్‌కు మంత్రి ప‌ద‌వి ఖాయం చేసింది. చాలా రోజుల త‌ర్వాత ఉత్కంఠ‌కు తెర‌ప‌డింది. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. కానీ, వివేక్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై సొంత పార్టీలోనే అస‌మ్మ‌తి రేగుతోంది. ఎన్నో ఏండ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ప్రేంసాగ‌ర్ రావుని కాద‌ని, పార్టీలు మారి వేరే పార్టీల్లో ఉన్న‌ప్పుడు కాంగ్రెస్ పార్టీనే తిట్టిన వ్య‌క్తిని కాంగ్రెస్ లోనే మంత్రి ప‌ద‌వి ఎలా క‌ట్ట‌బెడ‌తార‌నే చ‌ర్చ సాగుతోంది.

ఈ సంద‌ర్బంగా వివేక్ రాజకీయ జీవితంపై మళ్లీ చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వివేక్ బీజేపీలో ఉండి, చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ లో ఎంపీగా గెలిచిన వివేక్ ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మళ్లీ కాంగ్రెస్ లోకి వచ్చి 2014లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. కానీ 2019 లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరారు. ఆ పార్టీలో ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ఇన్నిసార్లు పార్టీలు మారిన వివేక్ కుటుంబానికి మూడు టిక్కెట్లు, మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

అదే స‌మ‌యంలో మంచిర్యాల ఎమ్మెల్యే పార్టీ కోసం పనిచేయడమే కాదు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను గట్టెకించారు. కాంగ్రెస్‌లో ఏమి లేదని చాలా మంది బీఆర్ఎస్, బీజేపీలోకి వెళ్లిపోయారు. పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న పీఎస్ఆర్ జిల్లాలో దానిని కాపాడారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు తీసుకున్న రేవంత్ రెడ్డి మొదటి సభ ఇంద్రవెల్లి దండోరా. ఆ సభను విజయవంతం చేసి, రేవంత్‌రెడ్డితో శ‌భాష్ అనిపించుకున్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభిస్తే ఉమ్మడి జిల్లాలో 30 రోజుల సుదీర్షకాలం సాగిన యాత్రను సక్సెస్ చేసి రాష్ట్రం కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలను మిగతా పార్టీలకు పంపించగలిగారు. భట్టి పాదయాత్రలో భాగంగా మంచిర్యాల నిర్వహించిన సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి ఖార్జున ఖర్గేను తీసుకొచ్చి భారీ బహిరంగ సభను విజ‌య‌వంతం చేయ‌గ‌లిగారు. మంచిర్యాల సభ పాదయాత్ర, రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి దండోరాతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జవసత్వాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారనే పేరు తెచ్చుకున్నది పీఎస్ఆర్.

ఇలా కాంగ్రెస్ పార్టీ క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు ఆదుకున్న పీఎస్ఆర్‌ను కాద‌ని వివేక్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధాన‌పర నిర్ణ‌యాలు చాలా బాగున్నాయి.. కానీ, వాటిని అమ‌లు చేయ‌క‌పోతే ఆ పార్టీ న‌ష్ట‌పోయే అవ‌కాశాలున్నాయ‌ని ప‌లువురు రాజ‌కీయ నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రికి ఎమ్మెల్యే టిక్కెట్లు, వారి కుమారుడికి ఎంపీ టిక్కెట్టు ఇవ్వ‌డమే కాకుండా ఇప్పుడు మ‌ళ్లీ వారిలో ఒక‌రికి మంత్రి ఇవ్వ‌డం అంటే పార్టీ శ్రేణుల‌కు, ప్ర‌జ‌ల‌కు ఏం సంకేతాలు ఇచ్చార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. అధిష్టానం పార్టీ విధేయ‌త చూస్తుందా…? పైసల బలం చూస్తుందా…? అని ఇన్నేండ్లు సాగిన చ‌ర్చ మాత్రం ముగిసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like