రైతులకు చేయూత అందిస్తాం

జిల్లాలో పంట సాగులో రైతులకు అన్ని విధాలుగా చేయూత అందిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతితో కలిసి వానాకాలం వ్యవసాయ సాగు సంసిద్ధత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానాకాలంలో పంటసాగులో రైతులకు అవసరమైన మెళకువలు అందించడంతో పాటు సాగునీరు, పంటరుణాలు, ఎరువులు, విత్తనాలు ఇతర అన్ని సదుపాయాలు సమకూర్చి చేయూత అందిస్తామన్నారు. పౌల్ట్రీ, డైరీ ఫారాలు, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, పెరటి కోళ్ళ పెంపకం ఇతర అంశాలపై అర్హులైన పాడి రైతులకు ప్రభుత్వ పథకాల కింద అవకాశం ఉన్న రాయితీ రుణాలు అందించనున్నట్లు వెల్లడించారు.
పంటరుణాలు, వ్యవసాయరుణాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా రుణాలను అర్హులైన లబ్దిదారులకు అందించి రైతులను అభివృద్ధి దిశగా ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో యూరియా, ఎరువులు, వరి, పత్తి విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన గోనె సంచులు, టార్పాలిన్ కవర్లను సమకూర్చినట్లు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు కోసం జిల్లాలో 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు మాట్లాడుతూ రైతులు మొదటి పంటలో దొడ్డురకం, సన్నరకం వరి ధాన్యాన్ని సాగు చేసుకోవచ్చన్నారు. రెండవ పంట సమయంలో పంట మార్పిడి విధానాన్ని అవలంభించి వాణిజ్య, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. దీని ద్వారా అధిక దిగుబడితో పాటు భూసారం పెంపొందుతుందని తెలిపారు. నిషేధిత/నకిలీ క్రిమి సంహారక మందులు వినియోగించవద్దని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలిపారు. అర్హత గల ప్రతి రైతుకు రాయితీ రుణాలు అందించేందుకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆ దిశగా బ్యాంకర్లు సహకరించాలని తెలిపారు. గోదాము, పశు వైద్యశాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం సన్నరకం వడ్లు సాగు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు.
కార్యక్రమంలో లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేంచంద్, అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రతినిధి సింగతి మురళి, మండల వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, ఫర్టిలైజర్ షాపుల యజమానులు, రైతులు పాల్గొన్నారు.