భార‌తదేశ సందేశాన్ని ప్ర‌పంచం విన్న‌ది

PM Modi: భారత ప్రధాని మోదీ (PM Modi) అఖిలపక్ష ఎంపీలతో భేటీ అయ్యారు. ఆపరేషన్‌ సింధూర్‌, ఉగ్రవాద నిర్మూలనపై అఖిలపక్ష పార్లమెంటరీ బృందాల ఎంపీలు భారత వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించి వచ్చిన విష‌యం తెలిసిందే. 10 రోజుల పాటు 33 దేశాల్లో పర్యటించిన 55 మంది ఎంపీలు పహెల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, ఉగ్రవాదంపై భారత్ విధానాన్ని అఖిలపక్ష బృందాలు ప్రపంచ దేశాలకు వివరించారు. పార్టీలకు అతీతంగా ఎంపీలు, మాజీ ఎంపీలు, దౌత్యవేత్తలతో కూడిన ప్రతినిధులు వివిధ దేశాల పర్యటనల సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ వైఖరి ప్రపంచ శాంతికి మ‌న దేశ నిబద్ధతను వివ‌రించారు.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ధాన‌మంత్రి మోదీ వారిని క‌లిశారు. ఢిల్లీలోని ప్రధాని అధికార నివాసంలో మంగళవారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం తరువాత, ప్రధానమంత్రి ప్రతినిధి బృందాల సభ్యులతో ఒక ఫోటో పోస్ట్ చేసి, “వారు భారతదేశం యొక్క స్వరాన్ని ముందుకు తెచ్చిన తీరు పట్ల మనమందరం గర్విస్తున్నామ”న్నారు. అఖిలపక్ష ప్రతినిధుల బృందాలలో ప్రతిపక్ష నాయకులు ఉండటం పట్ల ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు, ఇది “భారతదేశం నుంచి ఓ పెద్ద సందేశాన్ని” పంపుతుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం ఐక్యంగా ఉన్నామని భారతదేశం సందేశాన్ని అందించగలిగిందని ప్రధానమంత్రి స్ప‌ష్టం చేశారు.

ఎంపీల బృందం తమ పర్యటన విశేషాలను ప్రధానికిే వివరించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే, బీజేపీ ఎంపీలు రవిశంకర్‌ ప్రసాద్‌, బైజయంత్‌ పాండా, శివసేన ఎంపీ శ్రీకాంత్‌ శిందే, జేడీ(యూ) ఎంపీ సంజయ్‌ కుమార్‌ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆయా దేశాల్లో పర్యటించి ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌కు పాకిస్థాన్‌ తీరుపై వివ‌రాలు వెల్ల‌డించారు. “మేము మా అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నాము, దానిని ఆయన జాగ్రత్తగా విన్నారు” అని శివసేన (యుబిటి) ఎంపి & ప్రతినిధి బృందం సభ్యురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like