త‌ల‌నొప్పి త‌ట్టుకుంటారా..?

Incharge Minister:నేను వ్య‌క్తిగ‌తంగా.. ఈ జిల్లా మీద ప్రేమ‌తో ఆదిలాబాద్ ఇన్‌చార్జి బాధ్య‌త‌లు తీసుకున్నా.. కానీ, కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు.. పనిచేసే వారిని ఇబ్బందులకు గురిచేస్తూ మీడియాలో వ్యతిరేక వార్తలు రాయిస్తున్నారు…. జిల్లాకు సంబంధం లేని వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ నా పని చేయనివ్వడం లేదు… కేబినెట్ విస్తరణ తర్వాత ఇన్‌చార్జి మంత్రుల మార్పు సమయంలో ఆదిలాబాద్ బాధ్యతల నుంచి తప్పించాలని ముఖ్య‌మంత్రిని కోరుతా…

ఇవేవో సామాన్య వ్య‌క్తి మాట‌లు కావు.. సాక్షాత్తూ జిల్లా ఇన్‌చార్జీగా ప‌నిచేసిన మంత్రి సీత‌క్క(Minister Seethakka) మాట‌లు. ఆమె ఇన్‌చార్జీ మంత్రిగా ప‌నిచేసిన స‌మ‌యంలో గ్రూపులు, త‌గాదాలు, కొట్లాట‌లు, ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ర‌కాలుగా మంత్రి సీత‌క్క‌ను ఇబ్బందుల‌కు గురి చేశారు. దీంతో మ‌న‌స్థాపానికి గురైన ఆమె ఏకంగా తాను ఇన్‌చార్జీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటాన‌ని నేత‌ల‌కు చెప్ప‌డ‌మే కాకుండా, అన్న‌ట్టుగానే ఇన్‌చార్జీ బాద్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నారు. సీత‌క్క ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా ప‌ర్య‌ట‌న అన‌గానే గ్రూపులు, నేత‌ల ప‌ర‌స్ప‌ర ఫిర్యాదులు ఉండేవి. ఒకానొక స‌మావేశంలో నేను జిల్లా అభివృద్ధి ప‌నులు చూడాలా..? లేక‌పోతే మీ పంచాయ‌తీలు తీర్చాలా..? అంటూ నేత‌ల మీద ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారంటే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.

ఉమ్మ‌డి జిల్లా అంతటా ఇదే ప‌రిస్థితి..
ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు అంత‌టా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఆదిలాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి మ‌రీ దారుణం. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా క‌నీసం ఎంపీ స్థానం ద‌క్కించుకోని దుస్థితి. మీనాక్షి న‌ట‌రాజ‌న్ స‌మీక్షా స‌మావేశంలో ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకున్నారు. ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థి ఓటమికి ఎవ‌రూ ప‌నిచేయ‌లేద‌ని కొంద‌రు, అస‌లు అభ్య‌ర్థి ఎంపిక‌నే త‌ప్పు అని మ‌రికొంద‌రు, ఇలా ఒక‌రిపై ఒక‌రు నింద‌లు వేసుకున్నారు. జిల్లాకు సంబంధం లేని నాయకుడు ఒక‌రు ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని విభజిస్తున్నారని కొంద‌రు నేత‌లు అధిష్టానికి ఫిర్యాదులు చేశారు. ఇక వేరే జిల్లా అతను పార్టీని అడ్డం పెట్టుకుని సొంత వ్యాపారులు చేసుకుంటున్నాడ‌ని సైతం ఫిర్యాద‌లు పరంప‌ర వెళ్లింది.

ఆసిఫాబాద్ జిల్లాలో అయోమ‌యం..
ఇక ఆసిఫాబాద్ జిల్లాలో ప‌రిస్థితి కూడా అయోమ‌యంగా ఉంది. నేత‌ల మ‌ధ్య స‌యోధ్య లేదు. ఆసిఫాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు వ‌ర్గాల మ‌ధ్య వార్ కొన‌సాగుతోంది. ఎక్క‌డ ఏ కార్య‌క్ర‌మం జ‌రిగినా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు గ‌లాల్లు ప‌ట్టుకోవాల్సిందే. ఇక సిర్పూరు నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి ప‌నులు స‌క్ర‌మంగా సాగ‌డం లేదని, తాను కేసీఆర్ హ‌యాంలో బ్రిడ్జికి మంజూరు తెస్తే క‌నీసం దానిని క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని అందుకే తాను కాంగ్రెస్ పార్టీ వీడుతున్న‌ట్లు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప ప్ర‌క‌టించారు. ఇలా ఆసిఫాబాద్ జిల్లా ప‌రిస్థితి అస్త‌వ్యస్తంగా త‌యార‌య్యింది.

మంచిర్యాల జిల్లాలో మార‌ని ప‌రిస్థితి..
ఇక‌, మంచిర్యాల జిల్లా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఇక్క‌డ మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఇప్పుడు మంత్రి కూడా అయ్యారు. కానీ, వ‌ర్గ‌పోరు మాత్రం త‌ప్ప‌డం లేదు. స్వ‌యంగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే మాజీ జ‌డ్పీ వైస్ చైర్మ‌న్ మూల రాజిరెడ్డి వ‌ర్గం వివేక్‌పై అసంతృప్తితో ఉంది. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే వివేక్ పేరు చెబితేనే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే వినోద్ సైతం వివేక్‌పై అసంతృప్తితోనే ఉన్నారు. త‌న‌కు రావాల్సిన మంత్రి ప‌ద‌వి త‌మ్ముడు త‌న్నుకుపోయాడ‌ని మ‌న‌సులో ఫీలింగ్‌. పైకి క‌న‌బ‌డ‌కున్నా ఇక్క‌డ కూడా అదే ప‌రిస్థితి.

ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి అధ్వాన్నంగా ఉంది. నేత‌ల మ‌ధ్య స‌యోధ్య లేక జిల్లాలో అభివృద్ధి సైతం కుంటుప‌డిపోతోంది. మ‌రి ఇప్పుడు కొత్త‌గా జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) ఏం చేస్తార‌నేది స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న సీనియ‌ర్ మంత్రి కావ‌డంతో జిల్లాకు మేలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అంద‌రూ అనుకుంటున్నా… ఈ గొడ‌వ‌లు, కొట్లాట‌ల త‌ల‌నొప్పులు ఆయన ఏ మేర‌కు త‌ట్టుకుంటార‌నేది ఆస‌క్తిగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like