ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Minister Vivek:ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గానికి విచ్చేసిన ఆయనకు ప్రజలు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇసుక అక్రమ దందా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఇసుక దందా బంద్ చేయాలని మీరు కోరారు.. నేను బంద్ చేసి చూపించాను. అందుకే నా మీద నమ్మకంతో మైనింగ్ శాఖ నాకు అప్పగించారని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాలని చెప్పారని ప్రజలు, నేతల దృష్టికి తీసుకువచ్చారు. ఇసుక రాయల్టీ నిధులతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎక్కడ కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేశానని గెలిపించారు.. మీ నమ్మకం వమ్ము కానీయని మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఎక్కడా అవకతవకలు, అక్రమాలు లేకుండా అభివృద్ధి చేస్తానని మరోమారు ప్రజలకు తెలిపారు. ప్రజా పాలనలో ఎక్కడ కూడా అన్యాయంగా అరెస్ట్ చేయడం లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. తాను ప్రతీ గ్రామానికి రూ. 50 లక్షల నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నానని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటాన్నారు.
తాను విద్య పైన దృష్టి పెట్టానని సోమనపల్లిలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పనులు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు. నేను ఎప్పుడూ మీతోనే ఉంటాను మీకోసమే పని చేస్తానని హామీ ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. అనంతరం జైపూర్, భీమారం మీదుగా చెన్నూర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.