ప్రజల కోసమే ప్రతి రూపాయి ఖర్చు చేస్తాం

*అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు
*ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది *విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్దపీట
*ప్రజలకు అందుబాటులో అధికార యంత్రాంగం
*రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోంద‌ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో ఏర్పాటు చేసిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో క‌లిసి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు, నవీకరణ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా లక్షెట్టిపేటలో రూ. 8.50 కోట్లు ప్రభుత్వ నిధి, 1 కోటి రూపాయల సింగరేణి నిధులతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు.

ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల కేంద్రంలో రూ. 10.20 కోట్ల‌తో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేశామ‌న్నారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించామ‌న్నారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచి నూతన మెనూ ఖచ్చితంగా అమలు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ఉపాధ్యాయుల నియామకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింద‌న్నారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భ‌ట్టి విక్ర‌మార్క‌ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ దండేపల్లి మండలం అందుగులపేట (వెల్గనూర్) గ్రామంలో రూ. 3 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్న‌ట్లు వెల్ల‌డించారు. అనంతరం హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ శివారులో 212 ఎకరాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్ ఏర్పాటు కోసం భూమి పూజ నిర్వహించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా రాబోయే రోజుల్లో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. పెద్ద మొత్తంలో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తెలిపారు. అటవీ శాఖ సంబంధించిన నూతన వాహనాలను ప్రారంభించి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, కలెక్టర్ కుమార్ దీపక్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ – ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జి.సి.సి. చైర్మన్ కొట్నాక తిరుపతి, కనీస వేతన బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like