కార్గిల్ విజ‌యం వెన‌క క‌థ‌

Kargil War: ఎముక‌లు కొరికే చ‌లి.. తీవ్ర ప్ర‌తికూల ప్ర‌భావం.. శ‌త్రువులు కొండ‌ల‌పై నుంచి కాల్పులు.. కఠినతరమైన పర్వత ప్రాంతాలు.. అయినా, వీట‌న్నింటికి భ‌య‌ప‌డ‌ని భార‌త సైన్యం.. మ‌న‌ సైన్యం సంకల్ప బలం, కృత నిశ్చయం, త్యాగాలకు వెరవని అసమాన ధైర్య సాహసాలు ప‌ర్వ‌త ప్రాంతాల‌ను ఆక్ర‌మించుకోవాల‌నుకున్న పాక్ కుటిల‌బుద్దిని తిప్పికొట్టి తిరిగి మ‌న ప్రాంతాల‌ను కైవ‌సం చేసుకుని భార‌త ప‌తాక రెప‌రెప‌లు తిరిగి చూసిన సంద‌ర్భంగా.. అదే కార్గిల్ విజ‌య్ దివ‌స్‌..

పాకిస్తాన్… భార‌త్‌పై నిత్యం విషం చిమ్మే ఈ దేశం మ‌ళ్లీ ఓసారి మ‌న‌పై విషం క‌క్కేందుకు సిద్ధ‌మైన స‌మ‌య‌మ‌ది.. కాశ్మీర్‌లో శీతాకాలంలో సరిహద్దుల వెంబటి ఉన్న పోస్టుల‌ను ఖాళీ చేసి మళ్ళీ వేసవికాలం రాగానే తిరిగి వాటిలోకి వెళ్ళటం భారత సైన్యానికి ఆనవాయితీగా ఉండేది. అటువైపు ఉన్న పాకిస్తాన్ సైన్యం సైతం అలాగే చేస్తుండేది. కానీ 1999లో ఈ ఆనవాయితీ అదనుగా తీసుకోని పాకిస్తాన్ సైన్యం వాస్తవాధీన రేఖ దాటి అనేక పర్వత శ్రేణులను ఆక్రమించుకొని పర్వత శిఖరాలపై తిష్టవేసింది. భారత ఆర్మీ.. వారిని తరిమికొట్టే ప్రయత్నం చేసింది. తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, పర్వత శిఖరాలపైన అనువైన ప్రదేశంలో ఉన్న శత్రువుపై పోరాటం చేస్తూ కింద‌ నుంచి నిటారుగా ఉన్న పర్వత శిఖరాల వైపు ముందుకు సాగవలసి వచ్చినా మ‌న సైన్యం వెర‌వ‌కుండా ముందుకు సాగింది.

అప్పటికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సాంకేతికంగా బలోపేతం లేకపోవడంతో చొరబాటు దారులంతా మిలిటెంట్లుగా భావించింది ఆర్మీ. వారిని మట్టుబెట్టాక వారి దగ్గరున్న డైరీలు, ట్యాగులు చూశాక వారు ఉగ్రవాదులు కాదు, పాక్ సైనికులన్న విషయాన్ని నిర్ధారించింది ఆర్మీ. ఇదిలా ఉంటే కార్గిల్‌లోకి తాము చొరబడలేదంటూ పాకిస్తాన్ ఆర్మీ బుకాయించింది. మృతి చెందిన వారు తమ ఆఫీసర్లు కాదని, సైన్యంకు సంబంధించిన వారు కాదంటూ అబద్ధాలు చెప్పుకుంటూ వ‌చ్చింది. పాకిస్తాన్‌కు చెందిన ఫోన్ సంభాషణగల టేప్ బయటపడటంతో ఇక పాకిస్తాన్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. ఆనాటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ జనరల్ ముషారఫ్ మరో ఉన్నతాధికారి మధ్య జరిగిన సంభాషణలు ఆ ఫోన్ రికార్డింగ్‌లో బయటపడ్డాయి. దీంతో కార్గిల్‌లో కుట్ర చేసేందుకు పాక్ పన్నాగం పన్నిందని బట్టబయలైంది.

భారత ఆర్మీ పాక్ సైన్యం ఆక్రమించుకున్న పర్వతప్రాంతాలను తిరిగి కైవసం చేసుకునేందుకు కొన్ని బలగాలను అక్కడకు పంపింది. కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. టోలోలింగ్ పర్వత ప్రాంతం ముందుగా దక్కించుకోవడంతో భారత విజయంలో తొలి అడుగుపడింది. శ్రీనగర్-కార్గిల్-లేహ్‌లను అనుసంధానం చేసేదే టోలోలింగ్ పర్వత ప్రాంతం. ముందుగా ఈ హైవేను ధ్వంసం చేస్తే భారత్‌కు అవకాశం ఉండదని భావించింది పాక్ సైన్యం. అయితే పాకిస్తాన్ పప్పులు ఇక్కడ ఉడకలేదు. ముందుగా ఆర్మీతోనే యుద్ధం ప్రారంభమైనా తర్వాత ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ భారత నేవీలు కూడా రంగంలోకి దిగాయి. ఇక అరేబియన్ సముద్రం తీర ప్రాంతంలో భారత నేవీ గస్తీ ప్రారంభించింది. పాక్ పోర్టులను లక్ష్యంగా దాడులు నిర్వహించింది. ఈ దాడుల ప్రభావం ఎలా కొన‌సాగిందంటే ఇంకొన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగి ఉంటే పాకిస్తాన్‌లో మరో వారం రోజులకంటే ఎక్కువగా ఇంధనం ఉండేది కాదని స్వయంగా నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ ఓ ప్రకటన చేశారు.

ఇక మిలటరీ చర్యతో పాటు దౌత్యపరమైన చర్చలు కూడా జరిపి అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఒంటరిని చేసింది భారత్. భారత్ యుద్ధం ఆపాల్సిందిగా చెప్పాలంటూ పాకిస్తాన్ పాశ్చాత్యదేశాలతో పాటు చైనా సహకారాన్ని కోరింది. అయితే పాక్‌కు ఆశించినంత స్థాయిలో మద్దతు లభించలేదు. అంతేకాదు వివాదాస్పదమైన ప్రాంతాల నుంచి తమ సైన్యాన్ని వెనక్కు రప్పించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని కోరాయి ఈ దేశాలు. పాక్ బలగాలను వెనక్కు పంపిస్తామని చెబుతూ తయారు చేసిన డాక్యుమెంట్‌పై నవాజ్ షరీఫ్ సంతకం చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆదేశించారు. దీంతో నవాజ్ షరీఫ్ సంతకం చేయక తప్పలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు కార్గిల్ యుద్ధం కొనసాగింది. అన్ని ప్రాంతాలను భారత్ తన అధీనంలోకి తీసుకున్నాక 1999 జూలై 26న యుద్ధం ముగిసింది. భారత్ త్రివర్ణ పతకాన్ని సగర్వంగా ఎగురవేసింది. అందుకే జూలై 26న విజయ్ దివాస్‌గా జరుపుకుంటాం.

ఈ యుద్ధ స‌మ‌యంలో తమ దేశ భూభాగాన్ని కాపాడుకోవడానికి దృఢంగా నిలబడిన భారత సైనికుల త్యాగాలే ఈ యుద్ధాన్ని మలుపు తిప్పాయి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధంలో మ‌నం 527 మంది సైనికుల‌ను కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ యుద్ధంలో 1,363 మంది గాయపడ్డారని అధికారిక సమాచారం పేర్కొంది. అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ 4,000 మందికి పైగా పాకిస్తానీ సైనికుల ప్రాణాలను బలిగొన్నట్లు అంగీకరించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like