బీజేపీది రైతు హంతక ప్రభుత్వం
కేంద్రంపై కేసీఆర్ నిప్పులు
కేంద్రప్రభుత్వం మోసకారి ప్రభుత్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ దుయ్యబట్టారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన వడ్ల కొనుగోళ్లలో తప్పంతా కేంద్రానిదేనని విమర్శించారు. కేంద్రం బాయిల్డ్ రైస్ కొనలేమని స్పష్టం చేసిన నేపథ్యంలో యాసంగిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. ఈ విషయాన్ని ముందుగా చెబితే రైతులు వేరే పంట వేసుకుంటారని ఈ విషయం చెబుతున్నానని వ్యాఖ్యానించారు. కేంద్రంతో ఎంతో కొట్లాడిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. యాసంగిలో రైతులు వరి పండించవద్దని స్పష్టం చేశారు. వర్షాకాలం ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్న కేసీఆర్. వాటిని కేంద్రం కొనుగోలు చేయకపోతే ఢిల్లీలో తీసుకెళ్లి ప్రధాని ఇంటి ముందు, బీజేపీ ఆఫీసు ముందు పోస్తామని హెచ్చరించారు. రైతులు ఈ విషయాన్ని గుర్తించాలని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రైతులు సొంతంగా వరి వేసుకుంటామంటే తమకు ఇబ్బంది లేదన్నారు.
ధాన్యం బఫర్ స్టాక్ పెట్టుకోవడం కేంద్రం బాధ్యత కాదా అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తెలంగాణ పదివేల కోట్లు నష్టపోయిందని చెప్పారు. కేంద్రానిది సామాన్య, మధ్య తరగతి వ్యతిరేక విధానమని ఘాటైన విమర్శలు చేశారు. “కేంద్రం తన సామాజిక బాధ్యతను విస్మరించింది. ధాన్యం కొనం, కొనలేమంటూ బాధ్యతను వదిలేసింది. దేశ రైతాంగాన్ని మొత్తం గందరగోళంలోకి నెడుతోంది. చిల్లరకొట్టు షావుకారులా కేంద్రం మాట్లాడకూడదు. లాభనష్టాలను బేరేజు వేసుకుని మాట్లాడకూడదు. సామాజిక బాధ్యత నుంచి తప్పుకుంటూ నెపాన్ని రాష్ట్రాల మీద వేస్తోంది” అంటూ విమర్శలు చేశారు.
యాసంగిలో తెలంగాణలో పండేది కచ్చితంగా ఉప్పుడు బియ్యమే అని కేసీఆర్ తెలిపారు. అలాంటప్పుడు ఆ నష్టాన్ని ఎవరు భరించాలని అన్నారు. రైతు నష్టపోకుండా ఉండేందుకు బాయిల్డ్ రైస్ విధానం వచ్చిందని తెలిపారు. ఇప్పుడు బాయిల్డ్ రైస్ కొనలేమని కేంద్రం చేతులెత్తేసిందని.. కాబట్టి రైతులకు పంట మార్పిడి తప్ప మరో మార్గం లేదని సీఎం కేసీఆర్ తెలిపారు. “యాసంగిలో మేం ఇచ్చింది తీసుకోలేదు. బాయిల్డ్ రైస్ గింజ కూడా తీసుకోబోమని కేంద్రం చెప్పింది. రా రైస్ ఎంత తీసుకుంటుందో కూడా చెప్పలేదు. 90 లక్షల టన్నుల ధాన్యం తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. వర్షాకాలం ధాన్యం టార్గెట్‌కే దిక్కులేదు. నష్టపోకుండా ఉండటం కోసమే మిల్లర్లు బాయిల్డ్ రైస్ చేస్తున్నారు. మెడపై కత్తి పెట్టి లేఖ రాయించుకున్నారు. .
ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్‌లో నిలదీస్తే కేంద్రం దగ్గర జవాబు లేదన్నారు సీఎం. తెలంగాణలో వచ్చేదే బాయిల్డ్ రైస్ అన్న ఆయన.. బాయిల్ చేయకపోతే 50 శాతమే ప్రొడక్షన్ వస్తుందని చెప్పారు. కిషన్ రెడ్డికి దమ్ముంటే బాయిల్డ్ రైస్ కొనిపించాలని సవాల్ చేశారు కేసీఆర్. ఈ సమయంలో ఆయన ఓ సిపాయిలా పోరాడాలని.. కానీ.. చేతకాని దద్దమ్మలా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీది దిక్కుమాలిన పాలసీ అంటూ.. 750 మంది రైతుల్ని పొట్టనపెట్టుకున్న హంతక ప్రభుత్వమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, అధికారుల బృందంతో తాను ఢిల్లీ వెళ్తే.. కేంద్రం సరిగ్గా స్పందించలేదని చెప్పారు కేసీఆర్. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రైతుల్ని నిండా ముంచుతోందని మండిపడ్డారు.