కిం కర్తవ్యం…?
TBGKS: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డికి ప్రమోషన్ వచ్చింది.. ఆయన జూనియర్ ఆఫీసర్ ఈ-1 గ్రేడ్ అధికారిగా మారారు. ఇది సంతోషకరమైన వార్తనే.. కానీ, ఆయన ఇక నుంచి కార్మిక సంఘ నేతగా సమావేశాలు నిర్వహించడం కానీ, కార్మికులకు సంబంధించిన పోరాటాల్లో కానీ పాల్గొనడానికి వీలు లేదు.. మరి ఇప్పుడు అధిష్టానం ఏం చేయబోతోందనే ప్రశ్నార్థకంగా మారింది…
టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా మిర్యాల రాజిరెడ్డి కొనసాగుతున్నారు. ఆయన ఎన్నోఏండ్లుగా ప్రధాన కార్యదర్శిగా అనంతరం ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, ఆయనకు ఇప్పుడు అధికారిగా ప్రమోషన్ రావడంతో ఆయన నైతికంగా కార్మిక సంఘం బాధ్యతలు నిర్వహించే వీలుండదు. ఈ విషయం కొందరు యూనియన్ నేతలు, కార్మికుల్లో సైతం చర్చ సాగుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ప్రభుత్వపరంగా, ఇటు సింగరేణిలో సైతం టీబీజీకేఎస్ పోరాటాలు ఉధృతంగా సాగించాల్సి ఉంటుంది. దీంతో, యూనియన్ అధ్యక్షుడి విషయంలో చర్చ సాగుతోంది. ఇప్పటికే యూనియన్‌పరంగా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
కొప్పుల మదిలో ఏముంది..?
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్‌చార్జీగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను నియమించారు. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. మిర్యాల రాజిరెడ్డికి అధికారిగా ప్రమోషన్ రావడంతో అధ్యక్షుడిగా వేరే వారిని నియమిస్తారా..? లేక ఆయననే కొనసాగిస్తారా…? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. మిర్యాలను కొనసాగిస్తే సాంకేతికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.. మరి ఆయన ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారా..? లేదా..? అనేది కార్మికులు, కార్మిక సంఘ నేతలు ఎదురుచూస్తున్నారు.