పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్
PM Kisan Kyc: కేంద్ర ప్రభుత్వం రైతులకు నేడు పీఎం కిసాన్ స్కీమ్ కింద 20వ విడత నిధుల్ని విడుదల చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడే నిధుల్ని విడుదల చేశారు. దీంతో లబ్ధిదారుల అకౌంట్లోకి నేరుగా రూ. 2 వేల చొప్పున జమయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడత కింద మొత్తం రూ.20,500 కోట్ల విలువైన నిధులను నేరుగా రైతుల అకౌంట్లలో ప్రధాని మోదీ విడుదల చేశారు. దాదాపు పది కోట్ల మంది రైతులకు నేరుగా లబ్ధి చేకూరుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2019లో ప్రవేశపెట్టింది . ఇప్పటివరకు, ఈ కార్యక్రమం కింద 19 విడతల ద్వారా రూ.3.69 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాలకు బదిలీ చేశారు. 20వ విడతలో బాగంగా దాదాపు రూ. 20,500 కోట్ల మొత్తాన్ని 9.7 కోట్ల మంది రైతులకు బదిలీ చేసినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.
పీఎం కిసాన్ యోజన డబ్బులు అకౌంట్లో జమ అయ్యాయో లేదో ఇలా తెలుసుకోండి..
పీఎం కిసాన్ యోజన స్కీం కింద ప్రతి సంవత్సరం మొత్తం 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఈ డబ్బులను మొత్తం మూడు సమాన వాయిదాలు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున రైతుల అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రతి రైతుకు ఈ డబ్బులు నేరుగా వారి అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిషియరీ పద్ధతిలో లభిస్తాయి. అయితే ప్రతి విడతలు 2000 రూపాయలు లభిస్తాయి. ఈ డబ్బులను రైతులు తమ ఇష్టానుసారం ఖర్చు చేసుకోవచ్చు ఈ డబ్బులను రైతులు వ్యవసాయ ఖర్చులకోసం కానీ వ్యవసాయ ఇతర ఖర్చులకోసం కూడా ఖర్చు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పిఎం కిసాన్ యోజన డబ్బులు మీ అకౌంట్లో జమ అయ్యాయో లేదో తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ ఫోన్ కు నేరుగా పిఎం కిసాన్ యోజన అధికారిక పోర్టల్ నుంచి డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వస్తుంది. పీఎం కిసాన్ యోజన కింద నేరుగా డబ్బులు ఆ బ్యాంక్ అకౌంట్ లో పడతాయి ఈ నేపథ్యంలో మీ బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు డబ్బులు జమ అయినట్లు మెసేజ్ లభిస్తుంది. . దీని ద్వారా డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోవచ్చు.