మళ్లీ ముంచిన వాన..
-పలు చోట్ల భారీ వర్షాలతో అతలాకుతలం
-శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం
-ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇబ్బందులు
-పలు ప్రాంతాలకు నిలిచిపోయిన రాకపోకలు
-ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
-చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి చేరిన నీరు
-కొన్ని చోట్ల నీట మునిగిన పంటలు
Heavy Rains:మళ్లీ కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు చోట్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు రోజుల కిందట భారీ వర్షాలకు కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో పరిస్థితి అతలాకుతలం అయ్యింది. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొంది.
భారీ వర్షాలకు ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల- కొమురం భీం జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షంతో గుడిహత్నూర్ మండలం తోషం వద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆదిలాబాద్ నుండి ఉట్నూర్ మధ్య ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. అవసరమైతే మినహా బయటకు రావొద్దని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. ఉట్నూరు వద్ద నాగాపూర్ వంతెనపై సైతం నీళ్లు ప్రవహిస్తుండటంతో అక్కడ కూడా వాహనాలు నిలిపివేశారు. కొమరంభీం జిల్లా దహెగాం మండలం ఐనంలో లెవల్ వంతెన పై భారీగా వరద నీరు వెల్లడంతో దహెగాం కాగజ్‌నగర్ కు సైతం రాకపోకలు నిలిచిపోయాయి. ఉట్నూరు మండలం దంతనపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై నేలకొరిగిన చెట్టు. అప్పుడే అటుగా వెళ్తున్న కారును వెంటనే ఆపడంతో చెట్టు కారు ముందు పడింది. దీంతో కారులో ఉన్న ప్రయాణికులకు ప్రమాదం తప్పింది..
పలు చోట్ల ఇండ్లలోకి నీరు..
కొమరంభీం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వరద నీరు ఇండ్లలోకి చేరుతోంది. పెంచికల్ పేట్ లో భారీ వర్షానికి వరద నీరు ఇండ్లలోకి చేరింది. రెబ్బెన మండల కేంద్రాన్ని వరద ముంచెత్తింది. ఎన్టీఆర్ కాలనీ లో పూర్తిగా నీరు చుట్టూ ముట్టడంతో కాలనీ వాసులు జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. భారీ వర్షంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సైతం అదే దుస్థితి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చెన్నూరులో సైతం లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బెల్లంపల్లిలో పాత జీఎం క్రాస్ రోడ్ నుంచి వర్క్ షాప్ వరకు ప్రధాన రహదారిలో వరద నీరు చేరింది. రాంనగర్ బ్రిడ్జి ఉప్పొంగుతోంది. అశోక్ నగర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వరద నీటితో నిండిపోయింది.