ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి
Justice Sudarshan Reddy : విపక్షాల ‘ఇండియా’ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎన్నికల బరిలో నిలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పేరు మంగళవారం మధ్యాహ్నం ప్రకటించారు. తుషార్ గాంధీ పేరును టీఎంసీ వ్యతిరేకించడంతో కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి పేరును ప్రతిపాదించింది. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి టీఎంసీతో సహా అందరూ అంగీకరించారు. దీంతో ఇండియా కూటమి ఈ ప్రకటన చేసింది. ఖర్గే ఇంటిలో జరిగిన సమావేశం తర్వాత జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. ముందురోజు జరిగిన చర్చల్లో ఐఎస్ఆర్ఓ మాజీ శాస్త్రవేత్త ఎం. అన్నాదురై పేరు కూడా పరిశీలించారు. చివరకు జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చేశారు.
తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. 1946 జూలై 8న జన్మించిన ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి 1971లో హైదరాబాద్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా చేరారు. 1988-90 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, 1990లో ఆరు నెలలు కేంద్ర ప్రభుత్వ అదనపు సలహాదారుగా పనిచేశారు. 1995 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2007 నుండి 2011 జూలై 8 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ అనంతరం గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్త ఛైర్మన్‌గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు.
ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. ఆయనకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని మోదీ కోరిన కాసేపటికే ప్రతిపక్షాలు తమ అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించాయి. రాధాకృష్ణన్, సుదర్శన్ రెడ్డి మధ్య ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ జరగనుంది.