విద్యార్థి ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
-తిర్యాని మండలంలో ఆరో తరగతి గిరిజన విద్యార్థి మృతి
-గిరిజన ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సాగర్ సస్పెన్షన్\
-ఏఎన్ఎం సువార్త తొలగింపు
Negligence that cost a student’s life:గిరిజన పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. తిర్యాణి మండలంలోని ఆరో తరగతి విద్యనభ్యసిస్తున్న ఆత్రం అనురాగ్ డెంగు జ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే…
మండలంలోని పంగిడి మాదర ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న అనురాగ్ ఈనెల 15న తీవ్ర జ్వరం వచ్చింది దీంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అనురాగ్ కు నాలుగు రోజులు చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 19న మంచిర్యాల ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అక్కడి వైద్యులు బాలుడికి డెంగ్యూ వచ్చి రక్త కణాల సంఖ్య తగ్గిందని, కాలేయం పని సక్రమంగా నిర్వహించలేకపోతుందని తెలిపారు. అనురాగ్ ను తీసుకుని అతని తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం తిరిగి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న ఆర్.బి.ఎస్.కె డాక్టర్ కౌటిల్య బాలుని పరిస్థితి విషమంగా ఉందని వెంటనే వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని తల్లిదండ్రులకు సూచించారు. దీంతో 20న మళ్లీ మాత శిశు సంక్షేమ ఆస్పత్రిలో చికిత్స అందించి డాక్టర్ కౌటిల్య సూచన మేరకు 21న బాలున్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న అనురాగ్ పరిస్థితి విషమించి నిన్న రాత్రి మృతి చెందాడు. అనురాగ్ ఈ నెల 17 నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నా, ఇంత జరిగినా తమకు ఎలాంటి సమాచారం లేదని డీడీవో రమాదేవి తెలిపారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తమకు సమాచారం అంది ఉంటే బాలునికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడి ఉండే వాళ్లమని స్పష్టం చేశారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ప్రధానోపాధ్యాయులు సాగర్ ను సస్పెండ్ చేస్తూ ఏఎన్ఎం గా విధులు నిర్వహిస్తున్న సువార్తను తొలగించినట్లు పిఓ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని డీడీవో రమాదేవి తెలిపారు. హామీ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెబ్బన సర్కిల్ సిఐ, తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. సంఘటన జరిగిన ఆశ్రమ పాఠశాలను ఆసిఫాబాద్ ఆర్డిఓ లోకేష్ సందర్శించి వివరాలను సేకరించారు. అనంతరం మృతి చెందిన విద్యార్థిని ఇంటిని చేరుకొని తల్లిదండ్రులను పరామర్శించారు.