హెచ్ఆర్ఏ.. ఏమాయే సారూ..?
కార్మికుల పరిరక్షణే ధ్యేయంగా బతుకుతున్నామని చెప్పే కార్మిక సంఘ నేతలు వారి అసలు సమస్యలు పట్టించుకోవడం లేదు. కార్మికులు తమకు రావాల్సిన హక్కుల గురించి ఎవరిని అడగాలో తెలియని దుస్థితి. కార్మిక సంఘ నేతలు హడావిడి ప్రకటనలు, అనవసరపు ఆర్భాటాలు తప్ప కార్మికుల సమస్యల విషయంలో నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారు.
సింగరేణి కార్మికులకు సంబంధించి మున్సిపాలిటీల పరిధిలో ఉన్న వారికి హెచ్ఆర్ఏ ఇస్తారు. మున్సిపాలిటీల పరిధిలోని కార్మికులకు, ఉద్యోగులకు సింగరేణి 10 శాతం హౌజ్ రెంట్ అలవెన్సు అందచేస్తారు. మూడేండ్ల కిందట మున్సిపాలిటీలుగా మారిన వాటి పరిధిలోని సింగరేణి ఉద్యోగులకు కొత్త హెచ్ఆర్ఏ అందడం లేదు. పాత మున్సిపాలిటీల్లో ఇస్తున్నట్లు తమకు హెచ్ఆర్ఏ పెరుగుతుందని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నా అవి పెరగడం లేదు. సింగరేణి పరిధిలో క్యాతన్‌పల్లి, నస్పూర్, భూపాలపల్లి, సత్తుపల్లి మున్సిపాలిటీలుగా మారాయి. ఈ మున్సిపాలిటీల్లో ఇంకా అలవెన్స్ పెంచలేదు.
పట్టించుకోని యాజమాన్యం..
క్వార్టర్ సౌకర్యం లేని కార్మికులకు నెలకు రూ.150 మాత్రమే హెచ్ఆర్ఏ కింద ఇస్తున్నారు. మున్సిపాలిటీల పరిధిలో నివసించే బొగ్గు గనుల ఉద్యోగులకు, కార్మికులకు యాజమాన్యం క్వార్టర్ సౌకర్యం ఇవ్వకుంటే 10 శాతం హెచ్ఆర్ఏగా చెల్లించాలని బొగ్గు గని కార్మికుల వేజ్ బోర్డు నిర్ణయించింది. 2018 ఆగస్టు 1న మంచిర్యాల జిల్లాలో క్యాతన్‌పల్లి, నస్పూర్, జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి, మణుగూరు మున్సిపాలిటీలుగా చేశారు. అంతకుముందు సింగరేణిలో ఏరియాలో ఉన్న వారికి యాజమాన్యం హెచ్ ఆర్ ఏ అమలు చేస్తోంది. దాదాపు మూడేళ్లుగా తమకు 10 శాతం హెచ్ఆర్ఏ రావాల్సిఉండగా యాజమాన్యం పట్టించుకోవడంలేదని ఈ పట్టణాలకు చెందిన ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేజ్బోర్డ్ అగ్రిమెంట్ ప్రకారం హెచ్ఆర్ఏ పెంచి ఇవ్వాలని కార్మిక సంఘాలు పోరాటం చేయాల్సి ఉండగా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు పది వేల మందికి…
సింగరేణిలో ఉన్న మూడు కొత్త మున్సిపాలిటీల్లోని ఉద్యోగులు, కార్మికులకు హెచ్ఆర్ఏ ఇవ్వకపోవడంతో కోట్లలో నష్టపోతున్నారు. మంచిర్యాల జిల్లాలో రెండు మున్సిపాలిటీలకు చెందిన ఏడు వేల మంది ఉద్యోగులు, భూపాలపల్లి మున్సిపాలిటీలో దాదాపు మూడు వేలమంది వరకు ఉద్యోగులకు ఈ హెచ్ఆర్ఏ చెల్లించాల్సి ఉంది. బేసిక్ సాలరీపై 8 శాతం నుంచి 10 శాతం వరకు హెచ్ఆర్ఏ ఇవ్వాలి. సింగరేణిలో రూ.26 వేల నుంచి రూ.70వేల వరకు బేసిక్ సాలరీ ఉంటుంది. అంటే నెలకు ఒక్కో ఉద్యోగికి రూ.2080 నుంచి రూ. 5,600 వరకు చెల్లించాలి. ఆయా మున్సిపాలిటీల పరిధిలో క్వార్టర్ సౌకర్యం లేని సుమారు 10 వేల మంది ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అందడంలేదు. ఇంత మంది ఉద్యోగులు దాదాపు 70 కోట్ల నుంచి 80 కోట్ల మేర నష్టపోయారు.
సోయి లేని కార్మిక సంఘాలు..
ఈ విషయంలో కార్మిక సంఘాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కార్మికులు, ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘ నేతలను కలిసి ఎప్పటికప్పుడు ఈ విషయం వారి దృష్టికి తీసుకుపోయినా వారు కనీసం దానిపై దృష్టి సారించడం లేదు. తాజాగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా అన్ని జాతీయ కార్మిక సంఘాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. అయినా ఈ డిమాండ్ గురించి పట్టించుకోలేదు. కార్మిక సంఘాల నిర్లక్ష్యం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో యాజమాన్యంతో చర్చించి సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలని కోరుతున్నారు.