హరీష్‌రావు, సంతోష్ రావు వ‌ల్లే.. కేసీఆర్‌కు అవినీతి మ‌ర‌క‌లు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్ రావుది కీలకపాత్ర అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్ప‌ష్టం చేశారు. ఆమె సోమ‌వారం మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు, ముగ్గురు నేతలే కేసీఆర్‌పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. హరీష్‌రావు, సంతోష్‌రావు వల్లే కేసీఆర్‌కు ఈ పరిస్థితి దాపురించిందన్నారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు.

కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత..? అని ఆమె అన్నారు. నేను ఇలా మాట్లాడితే స్ధానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చు.. నష్టం జరిగినా సరే నేను మాట్లాడుతా అ అంటూ ఆమె స్ప‌ష్టం చేశారు. మొదటిసారి వీళ్ళ పేర్లు బయట పెడుతున్నానని ఆమె వెల్ల‌డించారు. ఈ దుర్మార్గుల వల్లనే కేసీఆర్ కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్ కు పార్టీ ఎందుకు పిలుపు ఇవ్వలేదని క‌విత ప్ర‌శ్నించారు. ఈ సమయంలో తెలంగాణ భగ్గు మనాలి.. కానీ, కానీ పార్టీ ఇలా ఉండడం ఏంటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ రేవంత్ ప్రభుత్వం మా నాన్నపై సీబీఐ విచారణ వేసింది. నా కడుపు మండిపోతోంది. మా నాన్నకు డబ్బు, తిండిపై ఏనాడూ యావ లేదు. మా నాన్న పరువు పోతే మాకు బాధ.. వాళ్లకు ఏం లేదు. కాళేశ్వరం అవినీతిలో హరీష్‌రావుది మేజర్ పాత్ర. అందుకే హరీష్‌రావును ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు. కేసీఆర్‌ను అడ్డుపెట్టుకుని హరీష్, సంతోష్ భారీగా ఆస్తులు కూడబెట్టారు. హరీష్‌రావు, సంతోష్‌రావుకు డబ్బు మాత్రమే కావాలి. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని అన్నారు. సోషల్ మీడియాలో నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like