రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు
Gold prices at record highs: బంగారం ధరలు కొత్త రికార్డు సృష్టించాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది (Gold prices). డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఈ రోజు బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,09,700 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 98,450 పలుకుతోంది. వెండి కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. కిలో వెండి ధర రూ.1,27,738 పలికింది. దీంతో బంగారం, వెండి ధరలు సామాన్య మధ్య తరగతి ప్రజలకు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి అని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర తొలిసారిగా 3,600 డాలర్లను దాటింది. ఇది గ్లోబల్ మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపింది. స్టాక్ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు కూడా పసిడికి అదనపు బలం ఇచ్చాయి. పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా బంగారాన్ని ఎంచుకోవడంతో భారీగా డిమాండ్ పెరిగింది. ఈ పరిస్థితులు పసిడి ధరలను రోజువారీగా కొత్త రికార్డులు సృష్టించేలా చేస్తున్నాయి.
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక కిలో వెండి ధర 1.27 లక్షల రూపాయలు దాటి రికార్డ్ నమోదు చేసింది. ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వెండి ధరలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సోలార్, ఆటోమొబైల్ రంగాల్లో వినియోగం అధికమవుతుండటంతో వెండిపై పెట్టుబడులు మరింతగా పెరిగాయి. ఫలితంగా వెండి ధరలు సైతం చరిత్రలోనే అత్యధిక స్థాయిని తాకాయి.
ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో సాధారణ ప్రజలకు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం కష్టతరంగా మారింది. ముఖ్యంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.98 వేలకుపైగా ఉండటంతో వివాహాలు, వేడుకల కోసం పసిడి కొనుగోలు చేయడం పెద్ద భారంగా మారింది. ఇక భవిష్యత్తులో ధరలు ఎటువంటి మార్పులు చూపుతాయన్నది అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.