ఆదర్శం.. ఆ గని ఉద్యోగులు..
విధులకు వెళ్తూ సింగరేణి కార్మికుడి మృతి… రోడ్డు ప్రమాదంలో తలకు గాయాలతో కార్మికుడు మరణం… ఇలా తరచూ వార్తలు వస్తుంటాయి. హెల్మెట్ లేకపోవడం వల్ల నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అందులో తరచూ సింగరేణి కార్మికులు గాయాల పాలు కావడంతో, మరణించడంతో జరుగుతోంది. దీనిని గమనించిన కొందరు సింగరేణి కార్మికులు తమ తోటి వారికి హెల్మెట్ పట్ల అవగాహన కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. సింగరేణి ఉద్యోగులందరూ విధులకు హాజరయ్యే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్‌కే 6 గని ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అందరూ హెల్మెట్లు ధరించి కార్మికుల కాలనీల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీరాంపూర్ జీఎం సురేష్, శ్రీరాంపూర్ ఏరియా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం వల్ల కార్మికులు క్షేమంగా ఇంటికి చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ముందుకు వచ్చిన యువకులు, కార్మికులను ఈ సందర్భంగా అభినందించారు.