బ్రేకింగ్… ముగ్గురు సూపర్ వైజర్ల సస్పెన్షన్
సీడీపీవో నక్క మనోరమ మెమో జారీ - అసలు దోషులను వదిలేసిన అధికారులు

మంచిర్యాల – మంచిర్యాల జిల్లాలో ముగ్గురు అంగన్‌వాడీ సూపర్ వైజర్లపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యహరించినందుకు వీరు ముగ్గురిని సస్పెండ్ చేశారు. చెన్నూరు సీడీపీవో నక్క మనోరమకు మెమో జారీ చేశారు.
సూపర్ వైజర్ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ముగ్గురు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లను సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వేమనపల్లి సూపర్‌వైజర్ పద్మ, కోటపల్లి సూపర్‌వైజర్ రాణి, జైపూర్ సూపర్‌వైజర్ రాజేశ్వరిని సస్సెండ్ చేశారు. అదే విధంగా సీడీపీవో మనోరమకు మెమో జారీ చేశారు. కొద్ది రోజుల కిందట సీసీసీ నస్పూరులో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా, ట్రాలీలో అంగన్‌వాడీకి సంబంధించిన కోడిగుడ్లు, పాలపాకెట్లు గుర్తించారు. గర్భిణులు, పిల్లలకు ఇవ్వాల్సిన కోడిగుడ్లు, పాలను కొందరు అంగన్‌వాడీ టీచర్లు బయట అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆయా ప్రాంతాలకు చెందిన సూపర్‌వైజర్లపై చర్యలు తీసుకున్నారు.
అసలు దోషులను వదిలేశారు..
అయితే ఇందులో అసలు దోషులను అధికారులు వదిలేశారనే ఆరోపణలు ఉన్నాయి. పాలు, గుడ్లు పక్కదారి పట్టడానికి కారణమైన టీచర్లను పట్టించుకోలేదు. వారి వెనక రాజకీయ నేతల అండదండలు ఉండటమే కారణమని పలువురు చెబుతున్నారు. కేసు కాకుండానే అటు పోలీసులను, ఇటు అధికారులను మేనేజ్ చేశారు. దీంతో కేసు వాళ్లపైకి రాకుండా చూసుకున్నారు. ఇక తమ శాఖాపరంగా కూడా ఎలాంటి చర్యలు లేకుండా చూసుకోగలిగారు. అసలు దోషులపై చర్యలు తీసుకుంటే ఇంకోసారి ఇలా చేయకుండా ఉండేవారని పలువురు చెబుతున్నారు.
అసలు కారణం ఆ అధికారే..
చెన్నూరు ప్రాంతం అంతా ఆగమాగం కావడానికి అక్కడ పనిచేస్తున్న ఒక అధికారిణే కారణంగా చెబుతున్నారు. ఎన్నో ఏండ్లుగా అక్కడే పాతుకుపోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు. కొందరు అధికారులు ఆమెను కదిలించాలని ప్రయత్నం చేసినా ఏం చేయలేకపోయారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనను అక్కడ నుంచి ట్రాన్స్‌ఫర్ చేస్తే చెన్నూరు ప్రాజెక్టు బాగుపడదని లేకపోతే ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతాయని చెబుతున్నారు.